టాక్ తేడా.. అయినా వసూళ్ల మోత

మార్చి చివరి వారంలో భారీ పోటీ మధ్య రిలీజైన సినిమా.. మ్యాడ్ స్క్వేర్. బడ్జెట్, కాస్టింగ్ పరంగా చూస్తే మిగతా మూడు చిత్రాలతో పోలిస్తే ఇదే చిన్న సినిమా.;

Update: 2025-04-01 03:53 GMT
టాక్ తేడా.. అయినా వసూళ్ల మోత

మార్చి చివరి వారంలో భారీ పోటీ మధ్య రిలీజైన సినిమా.. మ్యాడ్ స్క్వేర్. బడ్జెట్, కాస్టింగ్ పరంగా చూస్తే మిగతా మూడు చిత్రాలతో పోలిస్తే ఇదే చిన్న సినిమా. కానీ క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్, వసూళ్లు.. ఇలా అన్ని విషయాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ పూర్తి పైచేయి సాధించింది. తొలి రోజు ఉదయం ప్యాక్డ్ హౌస్‌లతో మొదలైంది ఈ చిత్రం. సినిమాకు టాక్ ఏమంత గొప్పగా లేదు. ‘మ్యాడ్’తో పోలిస్తే కంటెంట్ వీక్ అన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

‘మ్యాడ్’లో మాదిరిక కామెడీ ఆర్గానిక్‌గా లేదని.. బ్యూటిఫుల్ మూమెంట్స్ మిస్ అయ్యాయని.. పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేదని చాలామంది అన్నారు. అయినా సరే.. ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ విజయానికి అవేవీ అడ్డు కాలేదు. తొలి రోజే భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది.

తొలి వారాంతంలోనే ఏకంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా ‘మ్యాడ్ స్క్వేర్’ టీం ప్రకటించింది. ఐతే ఆ ఫిగర్లు కొంచెం ఎగ్జాజరేట్ అయ్యుండొచ్చు. కానీ సినిమా రూ.40 కోట్లకు తక్కువగా అయితే గ్రాస్ రాబట్టలేదు. ఈ సినిమా స్థాయికి ఇది చాలా పెద్ద నంబరే. మోహన్ లాల్ సినిమా ‘ఎంపురాన్’ మీద రిలీజ్ ముంగిట మంచి హైపే ఉంది కానీ.. తొలి రోజు తర్వాత ఆ సినిమా జోరు తగ్గిపోయింది. విక్రమ్ మూవీ ‘వీర ధీర శూర’ బలమైన కంటెంట్ ఉన్న సినిమానే కానీ.. దానికి సరైన పబ్లిసిటీ కరవైంది.

నితిన్ మూవీ ‘రాబిన్ హుడ్’ బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూడు చిత్రాలూ అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయాయి. ఐతే ‘మ్యాడ్’కు టాక్ ఏమంత గొప్పగా లేకపోయినా.. యూత్ ఆడియన్స్ ఈ సినిమా వైపే మొగ్గు చూపుతున్నారు. వీకెండ్లో ఈ సినిమానే వారి ఫస్ట్ ఛాయిస్ అయింది. ఆదివారం సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. దాదాపుగా తొలి వీకెండ్లోనే సినిమా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ అయిపోయింది.

Tags:    

Similar News