పెద్ద దర్శకుడు కెమెరా యాంగిల్ కూడా కాపీయేనా?
హాలీవుడ్ నుంచి కాపీలు లేదా సౌత్ నుంచి రీమేకులు చేస్తూ బాలీవుడ్ పబ్బం గడిపేస్తోందన్న వాదన బలంగా ఉంది.
బాలీవుడ్ లో కొత్త కథలతో ఒరిజినల్ సినిమాలు రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల సౌత్ డామినేషన్ నేపథ్యంలో ఈ చర్చ మరింత ఎక్కువైంది. హాలీవుడ్ నుంచి కాపీలు లేదా సౌత్ నుంచి రీమేకులు చేస్తూ బాలీవుడ్ పబ్బం గడిపేస్తోందన్న వాదన బలంగా ఉంది. దీనిపై నిపుణులు బహిరంగంగానే విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
అదలా ఉంచితే, ఇటీవల కాపీ రైట్ హక్కుల గురించి చాలా చర్చ సాగుతోంది. ఫలానా సీన్ ని ఫలానా దర్శకుడు కాపీ కొట్టాడంటూ, లేదా ఫలానా సినిమా నుంచి థీమ్ ని కాపీ చేసి తెరకెక్కించారని కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన 2005 చిత్రం పేజ్ 3లోంచి ఓ సన్నివేశాన్ని అనురాగ్ బసు లైఫ్ ఇన్ మెట్రో (2007) కోసం కాపీ చేసాడని ఒక వివాదం అప్పట్లో చెలరేగింది. ఒక యువతి ఇక వ్యక్తితో రాజీ పడే సన్నివేశాన్ని యథాతథంగా అనురాగ్ కాపీ చేసాడనేది వివాదం. రెండు సినిమాల్లో ఆ సన్నివేశం సారూప్యతల గురించి చాలా చర్చ సాగింది. `పేజ్ 3` విడుదలై 20 ఏళ్లయింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మధుర్ భండార్కర్ మాట్లాడుతూ.. తాను చిత్రీకరించిన సన్నివేశాన్ని అదే విధంగా కాపీ చేసాడని, కెమెరా కోణాలు కూడా ఒకేలా ఉన్నాయని అన్నారు. ఆ సన్నివేశాన్ని తెరకెక్కిస్తూ దానిని పేజ్ 3 సీన్ లా తీయాలని అనురాగ్ భావించినట్టు నటి కొంకణాసేన్ కూడా ధృవీకరించారు. అది ఒరిజినల్ సీన్ కానందున తాను అందులో నటించనని కొంకణ వ్యతిరేకించారట.
అయితే ఒకే పరిశ్రమలో వచ్చిన అదే సీన్ ని అతడు కాపీ చేయడం నిజంగా సవాల్ తో కూడుకున్నది. దానిపై అనురాగ్ చాలా విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు. సృజనాత్మక రంగంలో ఒరిజినాలిటీకి ప్రజలు పట్టంగడుతున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప, పుష్ప 2 చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడానికి కారణం అందులో చూపించిన ఒరిజినల్ కంటెంట్ అన్న ప్రశంసలు కురిసాయి. పుష్ప 2 ని ఉదాహరణగా చూపిస్తూ ఒరిజినల్ కంటెంట్ తో బాలీవుడ్ సినిమాలు రావాలని కొందరు కోరుకున్నారు. ఇటీవల బాలీవుడ్ విమర్శకులు, విశ్లేషకులు ఒరిజినల్ కంటెంట్ తో దర్శకులు సినిమాలు తీయాలని కోరుతున్నారు. కానీ ఇంకా కాపీ క్యాట్ సీన్స్, కథలపై ఆధారపడుతున్న దర్శకులు ఉన్నారు.
పూణే ఫిలింఇనిస్టిట్యూట్ సహా నాణ్యమైన శిక్షణా సంస్థలు ఉత్తరాది వారికి అందుబాటులో ఉన్నాయి. వాటి నుంచి ప్రతిభావంతులైన యువకులు క్రియేటివ్ రంగంలో తమ సత్తా చాటేందుకు ఉత్సాహంగా దూసుకొస్తున్నారు. అయితే వీరంతా కాపీ క్యాట్ కంటెంట్ కాకుండా ఒరిజనల్ కంటెంట్ తో నిరూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు.