పెళ్లి సంసారం తేలికైనవి కావు.. సీనియర్ నటి అనుభవం
ఈ సందర్భంగా భార్యాభర్తల అనుబంధం గురించి మాధురి మీడియాకు చెప్పిన సంగతులు సముచితంగా ఆకర్షిస్తున్నాయి.
బాలీవుడ్ అందాల కథానాయిక మాధురి ధీక్షిత్- శ్రీరామ్ నీనే వివాహానికి పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భార్యాభర్తల అనుబంధం గురించి మాధురి మీడియాకు చెప్పిన సంగతులు సముచితంగా ఆకర్షిస్తున్నాయి. మాధురి కెరీర్ పీక్స్ లో ఉండగానే, అమెరికాకు చెందిన శ్రీరామ్ నీనే అనే వైద్యుడిని పెళ్లాడారు. వారికి పిల్లలు ఉన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మాధురి మాట్లాడుతూ.. బంధంలో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలని జంటలకు సూచించారు.
''మీరు ఇవ్వాలి.. తీసుకోవాలి. ఇదొక గివ్ అండ్ టేక్ లాంటిది. ఒకే పైకప్పు క్రింద ఉన్న ఇద్దరు మనుషులు కాబట్టి, పెళ్లిలో పాజిటివ్‌లు ఉంటాయి.. ప్రతికూలతలు ఉంటాయని మీరు గ్రహించాలి'' అని అన్నారు మాధురి ధీక్షిత్. ఎల్లప్పుడూ భార్యా భర్తలు ఇద్దరూ సమానమైన లక్ష్యం కోసం పని చేస్తారనే వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. మీ ఇద్దరికీ కలలు ఉంటాయి. సమానమైన లక్ష్యాలు ఉంటాయి. మీరు ఎల్లప్పుడూ దాని కోసం పని చేస్తారు! అని అన్నారు. భర్త పిల్లలతో సంసార సాగరం గురించి మాట్లాడుతూ.. ''ఇది తేలికైన పని కాదు. మీకు తెలుసా.. ఇది అలాంటిలాంటిది కాదు. ప్రతిరోజూ దాని కోసం పని చేయాలి.. ఇది భాగస్వామ్యం. ఒకరికొకరు గౌరవం ఉండాలి. ఒకరికొకరు ప్రేమ ఉండాలి. అర్థం చేసుకునేందుకు స్పేస్ ఉండాలి'' అని వివాహ బంధంలో భార్యా భర్తలు ఎలా ఉండాలో విలువైన సూచననిచ్చారు మాధురి.
1984లో 'అబోధ్'తో అరంగేట్రం చేసిన మాధురి కెరీర్ లో 80కి పైగా చిత్రాలలో కనిపించింది. తనదైన నట ప్రతిభ, నృత్య కళతో మాధురి పేరు మార్మోగింది. 2008లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ సహా అనేక పురస్కారాలను పొందింది. ఇటీవలే మాధురి నటించిన భూల్ భులయా 3 విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాత్ర ప్రత్యేకత ఉన్నది గనుకనే అంగీకరించానని మాధురి తెలిపింది. 1999లో కార్డియోవాస్కులర్ సర్జన్ శ్రీరామ్ నేనేని మాధురి పెళ్లాడారు. ఈ జంట 2003లో వారి మొదటి కుమారుడు అరిన్‌ను స్వాగతించారు. వారి రెండవ అబ్బాయి ర్యాన్ 2005లో జన్మించాడు. మాధురి పెళ్లయి పిల్లలు ఎదిగాక తిరిగి నటిగా కెరీర్ ని పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే.