హాలీవుడ్ మూవీ కోసం సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూపులు
మహేష్ బాబు వాయిస్ ఇవ్వడంతో ఆయన సినిమా వచ్చినంతగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హాలీవుడ్ మూవీ 'ముఫాసా ది లయన్ కింగ్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ముఫాసా ది లయన్ కింగ్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ది లయన్ కింగ్ గతంలో తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్‌గా రాబోతుంది. గతంలో విజయం సొంతం చేసుకున్న లయన్ కింగ్ కి సీక్వెల్ కావడంతో తెలుగులో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఈ సినిమాలోని మెయిన్ పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో సినిమా స్థాయి మరింతగా పెరిగింది.
ముఫాసా ది లయన్ కింగ్ సినిమాకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో పాటు ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లోనూ పాల్గొన్నారు. పైగా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక కీలక పాత్రల కోసం బ్రహ్మానందం, అలీ సైతం డబ్బింగ్ చెప్పడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. మహేష్ బాబు వాయిస్ ఇవ్వడంతో ఆయన సినిమా వచ్చినంతగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన గుంటూరు కారం ప్లాప్ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
ఈ హాలీవుడ్ మూవీ హిట్‌ను మహేష్ బాబు ఖాతాలో వేసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ముఫాసా ది లయన్ కింగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆధరణ ఉంది. భారీ బజ్ నేపథ్యంలో సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేయబోతున్నారు. తెలుగు స్టార్ హీరోల సినిమాలు ఏ స్థాయిలో విడుదల అవుతాయో అదే స్థాయిలో ముఫాసా సినిమాను విడుదల చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
గతంలో వచ్చిన ది లయన్ కింగ్ తో పోల్చితే మరింత ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుంది అనే విశ్వాసంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇండియా మొత్తం అత్యధిక స్క్రీన్స్ లో సినిమాను విడుదల చేస్తున్నామని బయ్యర్లు తెలియజేశారు. తెలుగు లో మహేష్ బాబు వంటి స్టార్ డబ్బింగ్ చెప్పగా ఇతర భాషల్లోనూ అదే స్థాయి స్టార్స్ తో డబ్బింగ్ చెప్పించారు. అందుకే సినిమాకు అన్ని భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు లో ఈ సినిమా ఎంతగా వసూళ్లు సాధిస్తుంది అనేది చూడాలి.