ముఫాసా 'మహేష్'.. ఏమన్నారంటే..

నా కుటుంబం అంటే నాకు ఎంతో ప్రీతిగా ఉంటుంది. అందుకే ఈ డిస్నీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది.

Update: 2024-08-21 08:12 GMT

డిస్నీ రూపొందిస్తున్న "ముఫాసా: ది లయన్ కింగ్" అనే ప్రతిష్టాత్మక చిత్రానికి సూపర్‌స్టార్ మహేష్ బాబు తన వాయిస్‌ను అందించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 20 తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిస్నీ ఈ చిత్రాన్ని తెలుగులో మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేయాలన్న ఉద్దేశంతో మహేష్ బాబును ముఫాసా పాత్రకు ఎంపిక చేసింది.

మహేష్ బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం తనకెంతో ప్రత్యేకమని, కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించే తండ్రిగా ముఫాసా పాత్రలో మాట్లాడడం గొప్ప అనుభవంగా మారిందని పేర్కొన్నారు. "డిస్నీ చిత్రాలు నాకు ఎంతో ఇష్టం. ముఫాసా పాత్ర, తండ్రిగా తన కుమారుడిని మార్గదర్శనం చేయడమే కాకుండా, తన గుంపును సంరక్షించే రాజు అయినందున నాకు బాగా ఆకట్టుకుంది.

నా కుటుంబం అంటే నాకు ఎంతో ప్రీతిగా ఉంటుంది. అందుకే ఈ డిస్నీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. నా కుటుంబం, అభిమానులతో కలిసి తెలుగు వెర్షన్‌ను థియేటర్లో చూడటానికి ఎదురు చూస్తున్నాను" అని మహేష్ బాబు అన్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బారీ జెన్కిన్స్ తెరకెక్కించగా, అనేక విభిన్న పాత్రలను ప్రాణం పోసేలా డిజైన్ చేశారు.

లైవ్-యాక్షన్ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్‌తో పాటు ఫోటోరియల్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ ని మిళితం చేసి రూపొందించారు. తెలుగులో మహేష్ బాబు ముఫాసాగా వినిపించనుండగా, బ్రహ్మానందం పుంబా పాత్రలో, అలీ టిమోన్ పాత్రలో తమదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నారు. డిస్నీ స్టూడియోస్ హెడ్బ బిక్రమ్ మాట్లాడుతూ, "ప్రతీ కథను ప్రేక్షకులకు మరింత దగ్గరగా తీసుకురావడమే మా లక్ష్యం. ముఫాసా పాత్ర ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకం. తెలుగులో మహేష్ బాబు వాయిస్‌లో ఈ పాత్రను ప్రాణం పోసేలా చేయడం మా ఆలోచనకు మించిన ఆనందంగా ఉంది," అని చెప్పారు.

ఈ చిత్రం చిన్నతనంలో అనాథగా మారిన ముఫాసా ఎలా రాజుగా ఎదిగాడో ఆ కథను చూపించనుంది. మహేష్ బాబు అందించిన డబ్బింగ్, ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవ్వడంలో కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి లిన్-మాన్యుయెల్ మిరాండా సంగీతం అందించడం విశేషం. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అభిమానులు ఇప్పటికే భారీగా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News