'గేమ్ ఛేంజర్'.. దుబారా ఖర్చులు బాగా ఎక్కువయ్యాయా?
Makers Huge Money Spend In Game Changer Movie
సామాజిక అంశాలకి కమర్షియల్ హంగులు జోడించి భారీ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు ఎస్. శంకర్. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందిన స్టార్ డైరెక్టర్.. గత కొన్నేళ్లుగా తన రేంజ్ కు తగ్గ సక్సెస్ సాధించలేకపోతున్నారు. దీనికి తోడు భారీ తనం పేరుతో నిర్మాతలతో విచ్చలవిడిగా ఖర్చు చేయిస్తున్నారనే విమర్శలను కూడా మూటగట్టుకుంటున్నారు. ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' సినిమా విషయంలోనూ దుబారా ఖర్చులు చేసినట్లుగా చర్చలు జరుగుతున్నాయి.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన మొట్ట మొదటి తెలుగు సినిమా 'గేమ్ ఛేంజర్'. అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించారు. దర్శకుడి గత చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా అధిక మొత్తంలో ఖర్చు చేశారు. మేకింగ్, ప్రమోషన్స్.. ఇలా అన్నీ కలుపుకొని ఐదు వందల కోట్ల దాకా ఖర్చు అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా రిలీజైన తర్వాత, ఒక పొలిటికల్ యాక్షన్ సబ్జెక్ట్ కి అన్ని కోట్ల బడ్జెట్ అవసరమేనా? అనే ప్రశ్నలు తలెత్తాయి.
'గేమ్ ఛేంజర్' సినిమా ఎంత కలెక్ట్ చేసింది? బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా లేదా? అనేది పక్కన పెడితే.. నిర్మాతతో అనవసరంగా చాలా ఖర్చు చేయించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలోని పాటల కోసమో ₹ 75 కోట్లు ఖర్చు చేశారు. ఇవన్నీ శంకర్ శైలిలో గ్రాండ్ స్కేల్ లో షూట్ చేసారు. కానీ ఇవేవీ మూవీకి పెద్దగా బజ్ తీసుకురాలేదు. పైగా భారీగా ఖర్చు చేసి తీసిన 'నానా హైరానా' సాంగ్ కూడా సినిమాలో లేకుండా పోయింది.
ఇండియాలో తొలిసారిగా ఇన్ఫారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ ఇదని నానా హైరానా గురించి గొప్పగా చెప్పుకున్నారు. కానీ సినిమాలో ప్లేస్ మెంట్ కుదరకపోవడంతో మేకర్స్ ఆ పాటను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాన్స్ నుంచి రిక్వెస్టులు ఎక్కువ అడవంతో, జనాల దృష్టిని ఆకర్షించడానికి మళ్ళీ సినిమాలో యాడ్ చేశారు. అదే స్క్రిప్ట్ దశలోనే ఈ సాంగ్ అవసరం లేదని అనుకుంటే, దిల్ రాజుకు చాలా డబ్బులు మిగిలేవి కదా?.
సినిమాలో బోలెడంత మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. పేరుకి ఉన్నారంటే ఉన్నారు. వారికి కథలో తగిన ప్రాధాన్యత లేదు.. తగినంత స్క్రీన్ స్పేస్ కూడా లేదు. చాలా మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ, వారికి ఒక్క లైన్ డైలాగ్ లేదు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ప్రియదర్శి.. 'గేమ్ ఛేంజర్' సినిమాలో ఉన్నాడనే సంగతే తెలియలేదు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సునీల్ లాంటి హాస్య నటులు ఉన్నా సరిగ్గా ఉపయోగించుకోలేదు. వారికి తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ, ఎక్కువ కాల్ షీట్స్ బ్లాక్ చేయబడ్డాయి. దీని కారణంగా నిర్మాతకు ఖర్చు ఎక్కువైపోయింది.
నిజానికి 'RC 15' ప్రాజెక్ట్ ను 2021 ఫిబ్రవరిలోనే అధికారికంగా ప్రకటించారు. ఎట్టకేలకు 2025 జనవరి 10న రిలీజ్ అయింది. అంటే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. కారణాలు ఏవైనా ఒక కమర్షియల్ మూవీ తీయడానికి ఇన్నేళ్ళ సమయం పడితే, ఇంట్రెస్ట్ లు లెక్కకడితే నిర్మాత మీద అదనంగా ఎంత భారం పడుతుందో మనం ఊహించవచ్చు. ఇక మేకింగ్ లోనూ చాలా వేస్ట్ ఖర్చు అయినట్లుగా నివేదికలు పేర్కొన్నాయి.
సినిమాలో ఒక సన్నివేశం కోసం సుదూర ప్రాంతాల నుంచి అనేక గొర్రెలను తీసుకొచ్చారట. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని గొర్రెలు చనిపోయాయట. దీంతో వాటి స్థానంలోకి మరికొన్ని జీవాలను తీసుకురావాల్సి వచ్చిందట. రవాణా చార్జీలు మినహాయించి ఒక్కో గొర్రె ఏడెనిమిది వేలు ఎక్కువ ఖర్చు పెట్టినట్లుగా నివేదించబడింది. ఇలా సినిమాలో చాలా సీన్స్ విషయంలో అనవసరమైన ఖర్చు చేయడం వల్లనే బడ్జెట్ పెరిగిందని, సరైన ప్లానింగ్ లేకపోవడంతో నిర్మాత మీద అధిక భారం పడిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.