'సింహం అవ్వాలని ప్రతీ కుక్కకి ఉంటుంది'.. మంచు బ్రదర్స్ డైలాగ్ వార్!
ఈ నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు, మనోజ్ ల మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న డైలాగ్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మంచు ఫ్యామిలీలో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ కుమార్ ఓవైపు, మోహన్ బాబు మిగతా కుటుంబ సభ్యులంతా మరోవైపు అన్నట్లుగా గత కొన్ని రోజులుగా ఘర్షణ పడుతున్నారు. హైదరాబాద్ లోని జల్ పల్లి నివాసం కేంద్రంగా జరిగిన గొడవలు.. ఇప్పుడు తిరుపతి జిల్లాలోని ఏంబీ యూనివర్సిటీకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు, మనోజ్ ల మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న డైలాగ్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి 'రౌడీ' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇండస్ట్రీలో గోల్డెన్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా.. విష్ణు ఈ సినిమాలోని ఓ డైలాగ్ ను ట్విట్టర్ ఎక్స్ లో షేర్ చేశారు. "రౌడీ నాకు ఇష్టమైన సినిమా. ఇందులో నాకు నచ్చిన డైలాగ్స్ లో ఇది ఒకటి. ఆర్జీవీ నా ఫేవరెట్ డైరెక్టర్స్ లో ఒకరు. అతను ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. సినిమాలోని ప్రతి డైలాగ్ ఒక స్టేట్మెంట్ లాంటిది" అని విష్ణు పేర్కొన్నారు.
"సింహం అవ్వాలని ప్రతీ కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా, కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ" అంటూ రౌడీ సినిమాలో మోహన్ బాబు చాలా ఇంటెన్స్ తో చెప్పిన డైలాగ్ నే విష్ణు ఇప్పుడు షేర్ చేసింది. ఇది పరోక్షంగా ఆయన తమ్ముడు మంచు మనోజ్ ను ఉద్దేశించే పోస్ట్ చేసారని నెటిజన్లు అభిప్రాయ పడ్డారు. ఇంతలోనే మనోజ్ నుంచి దానికి కౌంటర్ ట్వీట్ పడింది. నేరుగా తన అన్న విష్ణు నటిస్తున్న 'కన్నప్ప' సినిమాని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసారు మనోజ్.
"కన్నప్ప సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజుగారి లాగా, సింహం అవ్వాలని ప్రతీ ఫ్రాడ్ కుక్కకీ ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్" అంటూ మనోజ్ పోస్ట్ పెట్టారు. #VisMith అని హ్యాష్ ట్యాగ్ పెట్టి అతనెవరో క్రాక్ చేయమని కోరాడు. ఇది అతని హాలీవుడ్ వెంచర్ అని క్లూ కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా కృష్ణంరాజు నటించిన సినిమాలకు సంబంధించిన క్యారక్టర్ పోస్టర్ ను పంచుకున్నారు. దీంతో మనోజ్ ట్వీట్ విష్ణును ఉద్దేశించే అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
అయితే అక్కడితో ఆగని మనోజ్.. #VisMith ట్యాగ్ తో మరో పోస్ట్ పెట్టాడు. ఇంట్రెస్టింగ్ గా అతను కూడా తన తండ్రి మోహన్ బాబు సినిమాలోని ఓ డైలాగ్ ను షేర్ చేశారు. "బలవంతంగా తన్ని కొట్టి చంపుతాను అని బెదిరించి, నేను తెచ్చి ఇచ్చిన దస్తావేదులు నాకు కావాలి" అంటూ విలన్స్ కు వార్నింగ్ ఇచ్చే సీన్ ఇది. "రేయ్.. కాలు దువ్వాలనుకుంటే అడుగు పెట్టగానే నీ తల నరికి నీ పెళ్ళాం ఒళ్ళో వేసేవాడిని. నా ఆలి సెప్పింది కాబట్టి, గొడవలు మాని చేసిన పాపం కడిగేసికుందామని వచ్చా" అంటూ మోహన్ బాబు చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ను మనోజ్ షేర్ చేశారు. ఇప్పటికైతే దీనికి కౌంటర్ గా విష్ణు నుంచి ఎలాంటి పోస్ట్ రాలేదు.
ఏదేమైనా ఇలా మంచు బ్రదర్స్ ఇద్దరూ తన తండ్రి సినిమాలలోని డైలాగ్స్ తో ట్విట్టర్ వార్ కి దిగడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ పరోక్షంగా అస్సలు తగ్గేదేలే అంటూ కయ్యానికి కాలు దువ్వేలా పోస్టులు పెట్టడం చూస్తుంటే, అన్నదమ్ముల మధ్య వివాదం అంత సులభంగా సమిసిపోయేలా కనిపించడం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చంద్రగిరి డెయిరీ ఫామ్ గేటు వద్ద జరిగిన ఘటనపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడంతో, మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.