టాలీవుడ్ లో పరిణామాలు.. మంచు విష్ణు కీలక ప్రకటన!

దీంతో ఎక్కడ చూసినా ఆ విషయాలపై చర్చలు నడుస్తున్నాయి.

Update: 2024-12-25 10:10 GMT

టాలీవుడ్ లో కొంత కాలంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు ఆపై అరెస్ట్, అక్కినేని ఫ్యామిలీ, సమంత- కొండా సురేఖ వివాదం, మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు, తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్.. అలా వివిధ అంశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

దీంతో ఎక్కడ చూసినా ఆ విషయాలపై చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు బుధవారం కీలక ప్రకటన చేశారు. తద్వారా 'మా' సభ్యులకు పలు సూచనలు చేశారు. సున్నితమైన విషయాలపై ఎవరూ.. ఎక్కడ కూడా బహిరంగంగా స్పందించకపోవడం మంచిదని అభిప్రాయపడ్డారు.

కళాకారులంతా ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులతో అనుబంధం, మంచి సంబంధాలు కలిగి ఉంటారని తెలిపారు మంచు విష్ణు. సినీ ఇండస్ట్రీ ఎప్పుడూ సహకారం, సృజనాత్మకతపై ఆధారపడి నడిచేదని అన్నారు. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల చిత్రసీమ ఎంతో అభివృద్ధి చెందిందని మంచు విష్ణు గుర్తు చేసుకున్నారు.

ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీ మన హైదరాబాద్‌ లో స్థిరపడేందుకు అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. అత్యంత ముఖ్యమైన ప్రోత్సాహం అందించిందని కొనియాడారు. అప్పటి నుంచి ప్రతి గవర్నమెంట్ తో కూడా సినీ ఇండస్ట్రీ ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉందని విష్ణు చెప్పారు.

అయితే కొంత కాలంగా టాలీవుడ్ లో జరిగిన పరిణామాలను అందరూ దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. 'మా' మెంబర్స్ అంతా సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగంగా ప్రకటించడం మానుకుంటే బెటర్ అని సూచించారు. వివాదాస్పద పరిణామాలపై ఒకేవైపు మాట్లాడటం మానుకోవాలని సభ్యులకు విష్ణు సజ్జెస్ట్ చేశారు.

ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. కాబట్టి అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలు పరిష్కరించకుండా మరింత నష్టం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే ఇలాంటి టైమ్ లో సహనం, సానుభూతి, ఐక్యత అవసరమని తెలిపారు. 'మా' అంతా ఓ పెద్ద ఫ్యామిలీ అని, ఏ సమస్య వచ్చినా అంతా కలిసి ఎదుర్కొందామని అన్నారు. అదే సమయంలో క్రిస్మస్, న్యూ ఇయర్ విషెస్ చెప్పారు విష్ణు.

Tags:    

Similar News