సినీ నటి హేమకు రిలీఫ్.. 'మా' సస్పెన్షన్ ఎత్తివేత
హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు కూడా సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
టాలీవుడ్ సినీ నటి హేమకు భారీ ఊరట లభించింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సస్పెన్షన్ ఎత్తివేసింది. కొన్ని రోజుల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారంలో హేమను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో రేవ్ పార్టీ కేసు విషయంలో ఆమె సరిగ్గా స్పందించకపోవడంతో సస్పెండ్ చేస్తున్నట్లు 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు కూడా సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
ఆ తర్వాత రేవ్ పార్టీ విషయంలో హేమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మంచు విష్ణు కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేశారు. సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. ఒక తల్లిగా, భార్యగా ఉన్న ఆమెపై లేని వదంతులు సృష్టించడం, వ్యక్తిగతంగా దూషించడం తగదని హితవు పలికారు. నిర్ధరణ లేని, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలని విష్ణు సూచించారు.
హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలని తెలిపారు విష్ణు. అయితే మొదటి నుంచి తాను ఎలాంటి మిస్టేక్స్ చేయలేదని హేమ చెబుతూనే ఉన్నారు. కానీ పోలీసులు అరెస్ట్ చేశాక ఆమె స్పందించకపోవడంతో 'మా' సస్పెండ్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియా ముందుకు వచ్చారు హేమ. పలు మీడియాల్లో వస్తున్న నిరాధారమైన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని తనను సస్పెండ్ చేయడం సరి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు అని మరోసారి చెప్పారు. అందుకు ప్రూఫ్ గా పలు రిపోర్ట్స్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. దేశంలోనే హై టెక్నాలజీ ల్యాబ్ లో తాను పరీక్షలు కూడా చేయించుకున్నట్లు తెలిపారు. ఆ రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పారు. ఏదేమైనా తాను కొందరి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. తనకు 'మా' అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ సమయంలో మంచు విష్ణుకు రిక్వెస్ట్ లెటర్ తో పాటు, మెడికల్ సర్టిఫికెట్లను పంపారు హేమ.
ఆ ఆధారాలను మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇటీవల పరిశీలించింది. అనంతరం సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా మంచు విష్ణు ఆదేశాలతో హేమపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 'మా' నుంచి ప్రకటన వచ్చింది. హేమపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఆమెకు భారీ ఊరట లభించినట్లయింది.