పార్టీల‌కు త‌న‌ను పిల‌వ‌డం లేద‌న్న జాతీయ ఉత్త‌మ న‌టుడు

ఎంతో ఆత్రుత, ఎదురు చూపులు.. చాలా ఏళ్ల పోరాటం త‌ర్వాత‌ చివ‌ర‌కు న‌మ్మిన క‌థ‌ల్లో న‌టించ‌గ‌లిగాన‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మ‌నోజ్ భాజ్ పాయ్ తెలిపారు.

Update: 2024-12-16 12:31 GMT

మూడు ద‌శాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో రెండుసార్లు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా పుర‌స్కారం అందుకున్న‌ మ‌నోజ్ భాజ్ పాయ్ ఎన్నో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల‌తో అల‌రించారు. రామ్ గోపాల్ వ‌ర్మ 'స‌త్య' సినిమా అత‌డి కెరీర్ లో కీల‌క మ‌లుపు. ఆ త‌ర్వాత న‌టుడిగా కెరీర్ ప‌రంగా వెనుతిరిగి చూసిందే లేదు. 100 పైగా చిత్రాలలో న‌టించిన మ‌నోజ్ భాజ్ పాయ్ ఈ విజయం అంత తేలికగా రాలేద‌ని తెలిపారు. ఎన్నో తిరస్కరణలు.. ఎంతో ఆత్రుత, ఎదురు చూపులు.. చాలా ఏళ్ల పోరాటం త‌ర్వాత‌ చివ‌ర‌కు న‌మ్మిన క‌థ‌ల్లో న‌టించ‌గ‌లిగాన‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మ‌నోజ్ భాజ్ పాయ్ తెలిపారు.

అయితే ఇంత సుదీర్ఘ కెరీర్ ఉన్నా కానీ, అత‌డు ఏనాడూ పార్టీల్లో రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో క‌నిపించ‌నే లేదు. ఇదే విష‌య‌మై త‌న‌ను ప్ర‌శ్నిస్తే....అత‌డు ఇలా అన్నాడు. నాకు పెద్ద వివాదాలు లేవు కానీ పార్టీల‌కు వెళ్లను...దానివ‌ల్ల‌ ఇప్పుడు నన్ను ఎవ‌రూ ఆహ్వానించడం లేదు అని భాజ్ పాయ్ తెలిపారు. పార్టీల‌కు హాజ‌ర‌వ్వ‌క‌పోతే బాధ‌ప‌డాలా.. అవ‌మానం ఎదుర్కోవాలా? అయినా నేను ఇలానే చాలా సంతోషంగా ఉన్నాను. దయచేసి నాకు కాల్ చేయవద్దు.. ఎందుకంటే నేను రాత్రి 10:30 గంటలలోపు నిద్రపోవాలనుకుంటున్నాను. నేను ప్ర‌తిరోజూ తెల్లవారుజామున నిదుర లేచేందుకు ఎదురు చూస్తాను అని మ‌నోజ్ తెలిపారు.

నేను అరుదుగా స్నేహితుల‌ను క‌లుస్తాను. కేకేమీన‌న్, న‌వాజుద్దీన్ లాంటి స్నేహితులు ఉన్నా కానీ వారంతా బిజీగా ఉండ‌టం వ‌ల్ల రెగ్యుల‌ర్ గా క‌ల‌వ‌లేక‌పోతున్నామ‌ని తెలిపారు. స‌హ‌న‌టులంటే త‌న‌కు గౌర‌వం ఉంద‌ని కూడా మ‌నోజ్ భాజ్ పాయ్ అన్నారు. తన ఆత్మగౌరవాన్ని అహంకారం అని భావిస్తార‌ని కూడా మ‌నోజ్ తెలిపారు. నా గురించి తెలియని వ్యక్తులు ఒక అవగాహనకు వ‌స్తారు. నేను రిజర్వ్డ్ లేదా దూరంగా ఉన్నందున నేను చాలా అహంకారినని కొందరు అనుకుంటారు. నేను నా గోప్యతను కఠినంగా కాపాడుకుంటాను. ఎవరైనా నేను అహంకారిగా భావిస్తే అలాగే ఉండండి. వాళ్ళు నాతో కూర్చొని నా గురించి తెలుసుకోవాల‌నుకున్న‌ప్పుడే ఇవ‌న్నీ తెలుసుకుంటారు అని కూడా మ‌నోజ్ భాజ్ పాయ్ అన్నారు. నేను అహంకారిని కాదు.. నాకు చాలా ఆత్మగౌరవం ఉంద‌ని అన్నారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... చివరిగా డెస్పాచ్ అనే చిత్రంలో మ‌నోజ్ కనిపించారు.

Tags:    

Similar News