దారి ఖర్చులకు ఇవ్వకపోవడం అన్యాయం: మనోజ్ భాజ్‌పాయ్
మనోజ్ బాజ్‌పేయి మాట్లాడుతూ, ''కన్వేయన్స్ అలవెన్స్ నటులకు అతిపెద్ద మద్దతు' అని పరిశ్రమలో ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నాడు.
జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ బాజ్‌పేయి కెరీర్ ప్రయాణంలో అలుపెరగకుండా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అతడు ప్రతిసారీ విలక్షణ పాత్రలతో హృదయాలను గెలుచుకుంటున్నాడు. ఎన్నో అవార్డులు రివార్డులు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇటీవల వినోద పరిశ్రమలో తన ప్రారంభ రోజులలో ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రస్థావించాడు.
ఔత్సాహిక తారలు ఎదుర్కొంటున్న ఆర్థిక పోరాటాలను హైలైట్ చేశారు. అతడి తదుపరి చిత్రం 'సైలెన్స్ 2: ది నైట్ ఔల్ బార్ షూటౌట్' కోసం ప్రచార ఇంటర్వ్యూ సందర్భంగా మనోజ్ బాజ్‌పేయి తన కెరీర్ ప్రారంభ కష్టాల గురించి మాట్లాడారు. ఆ సమయంలో 'కన్వేయన్స్ అలవెన్స్' ప్రాముఖ్యత గురించి హోస్ట్ సైరస్ బ్రోచాతో మాట్లాడారు.
మనోజ్ బాజ్‌పేయి మాట్లాడుతూ, ''కన్వేయన్స్ అలవెన్స్ నటులకు అతిపెద్ద మద్దతు' అని పరిశ్రమలో ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నాడు. అప్పటికే జీతాలు తక్కువగా ఉండేవి అని బాజ్‌పేయి అన్నారు. మా అతిపెద్ద మద్దతు ఒకప్పుడు రవాణా. దానికోసం మాకు రూ. 150 వచ్చేది.. ఆ రూ. 150తో ఏం చేయాలో ఆలోచించి మరీ ప్లాన్ చేసుకునేవాళ్లం.. అని తెలిపారు. ఈ పద్ధతి ఇప్పటికీ ఉందా అని అడిగితే మనోజ్ నవ్వుతూ, ''పాపం, అది ఇప్పుడు లేదు'' అని అన్నారు.
నటీనటులు తమ సొంత వాహనాలను ఉపయోగించినప్పుడు కూడా పెట్రోల్ కోసం రీయింబర్స్‌మెంట్ పొందేవారని, అది కూడా లేదు అని ఆయన వివరించారు. ఇప్పుడు అది కూడా ఇవ్వరు! అని అన్నారు. ఇది చాలా అన్యాయమని కూడా అన్నారు. ఆర్జీవీ సత్య సినిమా కోసం అన్ని ఖర్చులు కలుపుకుని 10వేల చెక్ అందుకున్నానని అన్నారు. అలాగే ఆ సినిమా సీన్ ఏది ఎప్పుడు ఎలా తీస్తారో ముందే తెలిసేది కాదని, ఒకసారి షూట్ చేయాల్సిన సీన్లు ఏమిటో చెప్పాలని ఆర్జీవీని కోరగా 'షటప్.. చెప్పింది చెయ్'' అని సీరియస్ అయ్యారని కూడా తెలిపారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... మనోజ్ ప్రస్తుతం Zee5 చిత్రం సైలెన్స్ 2లో నటించాడు. ప్రాచీ దేశాయ్ ఇందులో మరో ప్రధాన పాత్రధారి. ఓటీటీలో ఈ సిరీస్ కి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. తదుపరి 'భయ్యా జీ'లో కనిపించనున్నాడు. అపూర్వ్ సింగ్ కర్కి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 24న విడుదల కానుంది.