మార్టిన్‌ తో రానున్న మైత్రి..!

అందుకే అక్కడి ఫిల్మ్‌ మేకర్స్ తాము చేసే సినిమాలను పాన్‌ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు.

Update: 2024-09-18 11:42 GMT

కేజీఎఫ్ కి ముందు కన్నడ సినిమాలను ఇతర భాషల ప్రేక్షకులు, ఫిల్మ్‌ మేకర్స్ పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ కేజీఎఫ్‌ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారింది. ఈ మధ్య కాలంలో వరుసగా భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న కన్నడ సినిమాలు పాన్‌ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్నాయి. చిన్న సినిమాగా విడుదలైన కాంతార పాన్‌ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ మధ్య కన్నడంలో రూపొందిన ప్రతి సినిమా పై తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకుల ఆసక్తి ఉంటుంది. అందుకే అక్కడి ఫిల్మ్‌ మేకర్స్ తాము చేసే సినిమాలను పాన్‌ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు.


తాజాగా కన్నడంలో రూపొందిన భారీ బడ్జెట్‌ మూవీ 'మార్టిన్‌'. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో ధృవ సర్జా హీరోగా నటించగా, వైభవి శాండిల్య హీరోయిన్ గా నటించింది. యాక్షన్ కింగ్‌ అర్జున్ ఈ సినిమాకు కథను అందించగా, ఎ పి అర్జున్‌ దర్శకత్వం వహించాడు. ఈ మధ్య కాలంలో ధృవ నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి ప్రభావం చూపించాయి. కనుక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నైజాం ఏరియాలో పంపిణీ చేసేందుకు గాను హక్కులను కొనుగోలు చేసింది.

అక్టోబర్‌ 11న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'మార్టిన్‌' సినిమాలో ఇంకా సాధు కోకిల, చిక్కన్న, అన్వేషి జైన్‌, సుకృత వాగ్లే లు కీలక పాత్రల్లో నటించారు. పాటలకు మణిశర్మ సంగీతాన్ని అందించగా, కన్నడ స్టార్‌ మ్యూజిక్ కంపోజర్‌ రవి బస్రూర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్ ని అందించడం జరిగింది. కన్నడంలో రూపొందిన ఈ సినిమాను తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేసేందుకు ముందుకు రావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి పెరిగాయి.

ఈ సినిమా కథ మొత్తం లెఫ్టినెంట్‌ బ్రిగేడియర్ అర్జున్‌ సక్సేనా పాత్ర లో ధృవ సర్జా కనిపించబోతున్నాడు. శత్రు దేశాల దాడులను గురించి కనుక్కుని, వాటిని అడ్డుకునే దేశ రక్షకుడి పాత్ర లో ధృవ సర్జా కనిపించబోతున్నాడు. ఇండియా - పాకిస్తాన్ మద్య ఉన్న విభేదాలు, ఉగ్రవాదం నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఏపీ లోనూ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేసి పంపిణీ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. త్వరలో ఏపీ పంపిణీ విషయమై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. మైత్రి వారు తీసుకు రాబోతున్న మార్టిన్‌ తెలుగు ప్రేక్షకులను అలరించేనా చూడాలి.

Tags:    

Similar News