సంక్రాంతికి రావాల్సిన సినిమా.. ఇంకెప్పుడు?
ఇటీవల మేకర్స్ మే 9న సినిమాను విడుదల చేస్తామంటూ అఫిషియల్ గా ప్రకటించారు.;

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర ఎప్పటినుంచో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. మొదటి పోస్టర్ నుంచి మాస్ ఫీవర్ రేపిన ఈ సినిమా.. చివరికి ఎప్పుడొస్తుందా అనే ప్రశ్నకు మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేకపోతోంది. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మొదట పేర్కొన్నా.. తర్వాతి తేదీలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తుండటం ఫ్యాన్స్ లో నిరాశను కలిగిస్తోంది.
అసలైతే 2025 సంక్రాంతి బరిలో మాస్ జాతర ఉండబోతోంది అన్న అంచనాలు ఉండేవి. కానీ షూటింగ్ ఆలస్యం కావడం, రవితేజ చేతికి గాయం కారణంగా సినిమాకు బ్రేక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హీరో కొద్దికాలం విశ్రాంతి తీసుకోవడంతో షూటింగ్ షెడ్యూల్ వెనక్కి వెళ్లింది. దీంతో చిత్రబృందం రిలీజ్ డేట్ ను మార్చక తప్పలేదు.
ఇటీవల మేకర్స్ మే 9న సినిమాను విడుదల చేస్తామంటూ అఫిషియల్ గా ప్రకటించారు. బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్, పోస్టర్లు, సాంగ్స్ అన్నీ మే విడుదలను బలంగా నిర్ధారించినట్టే అనిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ డేట్ పై కూడా అనుమానం నెలకొంది. పోస్టుప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తికాకపోవడం, కొన్ని కీలక విజువల్స్ కంప్లీట్ అవ్వకపోవడంతో మళ్లీ రవితేజ ఫ్యాన్స్ ఎదురుచూడాల్సి రావచ్చు.
లేటెస్ట్ టాక్ ప్రకారం, మేకర్స్ ఇప్పుడు జూలై నెలను టార్గెట్ చేస్తూ కొత్త రిలీజ్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు సమాచారం. సీతార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకే నాణ్యత విషయంలో రాజీపడకుండా పూర్తిస్థాయిలో ఫినిషింగ్ చేయాలని దర్శకుడు భాను భోగవరపు చూస్తున్నారట.
రవితేజ పాత్రకు సంబంధించి కొన్ని ప్రత్యేక యాక్షన్ సీక్వెన్స్‌లు పోస్ట్ ప్రొడక్షన్ లో ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మరింతగా హైప్ పెంచేలా మాస్ రాంపేజ్ గ్లింప్స్, మాస్ పోస్టర్స్ అన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. కానీ రిలీజ్ డేట్ పెడితేనే ఈ క్రేజ్ బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుంది.
మొత్తానికి, మాస్ జాతర బాక్సాఫీస్ లో సందడి చేయడానికి ఇంకొంత టైం పడేలా ఉంది. జూలై రిలీజ్ ఖరారైతే, మిడ్ సమ్మర్ సీజన్ లో రవితేజ మాస్ స్టామినా చూసేందుకు అభిమానులు సిద్ధమవుతారు. అధికారికంగా డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి కానీ, ఈ సారి అయినా మాస్ జాతర థియేటర్ లో పండగ చేసేదెప్పుడో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.