GOAT సింగిల్: పరమ రొటీన్ ఊర 'మస్తీ' ట్యూన్
ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఊర మాస్ మస్తీ లిరికల్ సాంగ్ కూడా అంతే నిరాశపరిచింది.
ఒక పెద్ద హీరో సినిమా వస్తోంది అంటే ఆ సినిమా సంగీతంపైనా అభిమానుల్లో అంచనాలుంటాయి. పాటలు హిట్టయితే దానికి తగ్గట్టే సినిమాలో కంటెంట్ పైనా ఆసక్తి క్రియేటవుతుంది. ఒకవేళ పాటలు ఫెయిలైతే ఆ నీరసంతో థియేటర్‌కి కూడా వెళ్లాలని అనిపించదు. సంగీతం ప్రభావం అలాంటిది. సంగీతాన్ని ప్రేమించేవాళ్లు ఇటీవలి కాలంలో ఒక పెద్ద హీరో సినిమా పాటలు వినాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడూ అదే మోనోటనీ... రొటీనిటీ.
గత కొంతకాలంగా పెద్ద హీరోల సినిమాలకు సంగీతం అందిస్తున్న అనిరుధ్ రవిచందర్, సంతోష్ నారాయణన్ లాంటి బడా మ్యూజిక్ డైరెక్టర్లు ఏదో మ్యాజిక్ చేస్తారనుకుంటే ఇతరుల్లానే వీళ్లు కూడా అదే తరహా రొటీన్ దంచి కొట్టుడుతో మాస్ హీరోని ఎలివేట్ చేయాలనే తపనలో మునిగిపోవడంతో వీళ్లంతా ఇటీవలి బడా సినిమాలన్నిటికీ రొటీనిటీని ఆపాదించారు. కనీసం బీజీఎం, థీమ్ మ్యూజిక్ లో కూడా ఆకట్టుకోవడంలో రొటీనిటీని ఆశ్రయించడం తీవ్రంగా నిరాశపరుస్తోంది.
ఇటీవల బన్ని- అల వైకుంఠపురములో, కమల్ హాసన్- విక్రమ్, రణబీర్ - యానిమల్ సినిమాలకు మాత్రమే ఆసక్తిని కలిగించే బీజీఎం- పాటలు కుదిరాయి. అందుకే ఇప్పుడు దళపతి విజయ్ నటిస్తున్న 'ది గోట్' మ్యూజిక్ పరంగా అలాంటి వైబ్ ని క్రియేట్ చేస్తుందని వెయిట్ చేసిన చాలా మందికి కనీసం ఆ దరిదాపుల్లో కూడా మ్యూజిక్ లేదని నిరాశ కలుగుతుంది. ఇప్పటికే ది గోట్ పోస్టర్లు, ఇతర ప్రచార సామాగ్రిపై చాలా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఊర మాస్ మస్తీ లిరికల్ సాంగ్ కూడా అంతే నిరాశపరిచింది. ఒకటే దంచి కొట్టుడు.. ఊర మాస్ కొట్టుడుతో ఒక రకమైన టైపికల్ తమిళ ట్యూన్ ని అందించాడు యువన్ శంకర్ రాజా. బహుశా అతడిపైనా మన మాస్ థమన్ ప్రభావం పడిందో లేదా అనిరుధ్, సంతోష్ నారాయణ్ లాంటి వారు ఆవహించారో ఏమో కానీ, ఇది పరమ రొటీన్ తమిళ బాణీని తలపించింది. ది గోట్ తర్వాత విజయ్ మరో సినిమా మాత్రమే చేస్తారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోతారు. కానీ ఈ చివరి రెండు సినిమాల మ్యూజిక్ ని అయినా గుర్తుంచుకునేలా చేస్తారని ఆశ.
విజయ్ నటించే ప్రతి సినిమాని మాస్ కి చేరువ చేయాలనే తపన దర్శకులకు ఉండొచ్చు. అలాగని అవే ట్యూన్లను తిప్పి తిప్పి వినిపిస్తే థియేటర్లకు వెళ్లే ఆడియెన్ కి విసుగొస్తుంది. విజయ్ నటించిన వాటిలో మెర్సల్, గిల్లీ, తేరి, మాస్టర్, బీస్ట్ ఇలా ఏ సినిమా చూసినా అందులో వినిపించేసిన ట్యూన్ నే కాస్త అటూ ఇటూ తిప్పి యువన్ ఎందుకు ఇచ్చినట్టు? ఆ మాత్రం పనితనానికి అంత పెద్ద సంగీత దర్శకుడిని ఎందుకు ఎంపిక చేసినట్టు? ఇలా బోలెడన్ని సందేహాలు! మస్తీ లిరికల్ సాంగ్ లో అనిరుధ్ చాలా వరకూ కనిపించి వినిపిస్తున్నట్టే ఉంది! కనీసం ఇక ముందైనా కొంత క్రియేటివిటీ ఉన్న మ్యూజిక్ ని విజయ్ తెలుగు-అభిమానులు, సంగీత ప్రియులు ఆశిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.