నితిన్‌ కి థ్యాంక్స్ చెబుతున్న కామెడీ లవర్స్‌...!

టాలీవుడ్‌ లోనే కాకుండా ఏ భాష సినిమాలో అయినా కామెడీ ఉంటేనే బాగుంటుంది. కామెడీ లేకుండా చేసిన సినిమాలు చాలా తక్కువ ఉంటాయి.

Update: 2024-09-16 11:30 GMT

టాలీవుడ్‌ లోనే కాకుండా ఏ భాష సినిమాలో అయినా కామెడీ ఉంటేనే బాగుంటుంది. కామెడీ లేకుండా చేసిన సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. కామెడీ లేకుండా రూపొందిన సినిమాల్లో హిట్‌ శాతం చాలా తక్కువ అనడంలో సందేహం లేదు. కామెడీ ప్రధానంగా వచ్చిన సినిమాలు మినిమం గ్యారెంటీ అన్నట్లు వసూళ్లు నమోదు చేస్తూ ఉంటాయి. కేవలం కామెడీ వల్లే భారీ విజయాలను సొంతం చేసుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా విడుదలైన మత్తు వదలరా 2 సినిమా కేవలం కామెడీ వల్ల, అదీ సత్య కామెడీ వల్ల మంచి విజయాన్ని సొంతం చేసుకుని, భారీగా వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకు పోతుంది.

విడుదలైన మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లోనూ బ్రేక్‌ ఈవెన్ కి చేరువైన 'మత్తు వదలరా 2' సినిమా లో హీరో శ్రీ సింహా అయినా కమెడియన్ సత్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సినిమాలో సత్య కనిపించిన ప్రతి ఫ్రేమ్‌ నవ్వు తెప్పిస్తుంది. చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు సత్య కామెడీ గురించి ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. సత్య ఫ్యూచర్‌ ఆఫ్ తెలుగు సినిమా కామెడీ అంటూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. బ్రహ్మానందం, సునీల్‌ ల తర్వాత ఆ స్థాయి కమెడియన్‌ టాలీవుడ్‌ కి దొరకలేదు అనుకుంటున్న వారికి సత్య రూపంలో ఆ లోటు తీరబోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తన కామెడీతో సినిమాలను హిట్ చేసి, ప్రేక్షకులను నవ్వించి నవ్వించి చంపుతున్న సత్య కి ఇప్పటికే ఫ్యాన్స్ స్టార్‌ కమెడియన్‌ ట్యాగ్‌ ఇచ్చేశారు. ఈ స్టార్‌ కమెడియన్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది సహాయ దర్శకుడిగా అనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా మత్తు వదలరా 2 సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌, మొదట్లో అవకాశాల గురించి మాట్లాడాడు. ఆ సమయంలోనే నేను సహాయ దర్శకుడిగా చేసేందుకు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ సమయంలో షాట్‌ రెడీ అంటూ నటీనటులను పిలవాల్సినప్పుడు ఎలా పిలవాలో తెలియక మిమ్ముల డైరెక్టర్ గారు పిలుస్తున్నాడు అంటూ భీమవరం యాసలో చెప్పేవాడిని. అది నితిన్ గారికి నచ్చింది.

నితిన్ గారు అప్పుడే నువ్వు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ లో కాకుండా యాక్టింగ్‌ చేయి బాగుంటుందని అన్నాడట. అనడమే కాకుండా పట్టుబట్టి, బలవంతంగా ఒక పాత్ర ఇచ్చి చేయించారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు సత్య వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో, చిన్న హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. హీరోగా కూడా సత్య నటించి నవ్వించాడు.

హీరో నితిన్‌, రచయిత హర్ష వర్దన్ లు తనలోని కమెడియన్‌ ను గుర్తించారని సత్య చేసిన వ్యాఖ్యల వీడియోను నెట్టింట కొందరు షేర్‌ చేసి ఇలాంటి ఒక కమెడియన్‌ ను ఇచ్చినందుకు థాంక్స్ అన్న అంటూ నితిన్‌ ను ట్యాగ్‌ చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో సత్య కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీని ఇష్టపడే ప్రతి ఒక్కరు ఇప్పుడు సత్యను ఇష్టపడుతున్నారు. వారంతా నితిన్ కి థాంక్స్ చెబుతున్నారు. ప్రతిభ ను గుర్తించిన వారు గొప్ప వారు, అలా సత్య లో ఉన్న ప్రతిభ ను నితిన్ గుర్తించడం గొప్ప విషయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News