క్లాసిక్ థియేటర్ లో మట్కా స్పెషల్ టీజర్.. గెట్ రెడీ

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ హడావుడి ఇప్పటికే మొదలైంది.

Update: 2024-10-03 15:34 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రతీ సినిమాలో కూడా ఏదో ఒక కొత్త తరహా కంటెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అలాగే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ప్రయోగాలు చేస్తున్నాడు. ఇక వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్స్‌ ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మట్కా కూడా ఒక ప్రయోగాత్మక చిత్రమే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ హడావుడి ఇప్పటికే మొదలైంది.


ఇక మట్కా చిత్రం పీరియాడిక్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మట్కా సినిమాలో వరుణ్ తేజ్ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన సినిమాగా నిలవబోతోంది.

ఇప్పటికే విడుదలైన సెకండ్ లుక్ పోస్టర్ కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ ను అక్టోబర్ 5వ తేదీన విజయవాడలోని క్లాసిక్ థియేటర్ అయిన రాజు యువరాజు థియేటర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సందడి చేయనున్న ఈ టీజర్ ద్వారా సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్ ద్వారా మట్కా సినిమాపై విస్తృతంగా ప్రమోషన్స్ మొదలు కానున్నాయి.

సినిమాలో వరుణ్ తేజ్ పాత్రకు ఎన్నో షేడ్స్ ఉండబోతున్నాయని ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరో సరసన మీనాక్షి చౌదరి మరియు నోరా ఫతేహీ కనిపించనున్నారు. ఇక వీరిద్దరూ ఇప్పటికే టాలెంటెడ్ హీరోయిన్లుగా మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కు కూడా వారి గ్లామర్ యాక్టింగ్ స్కిల్స్ తో మరింత ప్రత్యేకతను జోడించనున్నట్లు తెలుస్తోంది.

మట్కా సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరామెన్ గా ఎ. కిషోర్ కుమార్ పని చేస్తున్నారు. కార్తిక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, డైరెక్షన్ అన్నీ కలిపి ఈ సినిమాను ఒక విజువల్ ఫీస్ట్ గా తీర్చిదిద్దుతున్నాయని సమాచారం.

మట్కా చిత్రం ప్రస్తుతం చివరి దశలో షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ పూర్తవడానికి మరికొద్ది రోజులు మాత్రమే ఉండడంతో, మేకర్స్ సినిమా విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. ఫైనల్ గా మట్కా చిత్రం ఈ ఏడాది నవంబర్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. వరుణ్ తేజ్ కెరీర్ లో మరో కీలక చిత్రం కానున్న ఈ సినిమా, యాక్షన్, డ్రమా, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News