మట్కా వరుణ్.. స్టైలిష్ అండ్ కూల్
ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్.. తన కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయారు. దీంతో తన అప్ కమింగ్ మూవీస్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం మట్కా మూవీలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న మట్కాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. రీసెంట్ గా అక్కడి షెడ్యూల్ పూర్తి అయిందని, వైజాగ్ లో షూటింగ్ జరుగుతున్నట్లు వెల్లడించారు. 1980 బ్యాక్ డ్రాప్ వైజాగ్ లొకేషన్స్ ను రీక్రియేట్ చేసిన స్పెషల్ గ్లింప్స్ నెట్టింట ఇప్పటికీ వైరల్ అవుతోంది.
పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. మూవీలో 24 ఏళ్ల పాటు సాగే కథలో వరుణ్ తేజ్.. చిన్నప్పటి రోల్ నుంచి వృద్ధుడి రోల్ వరకు కనిపించనున్నారట. దీంతో ఆయన తన పాత్రల కోసం బాగా కష్టపడుతున్నట్లు సమాచారం. మేకోవర్స్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మట్కాలోని రోల్స్.. వరుణ్ కు పెద్ద సవాళ్లు లాంటివే.
అయితే వరుణ్ ప్రస్తుతం డ్యాన్స్ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో వరుణ్ క్లీన్ షేవ్ తో కూల్ గా కనిపిస్తున్నారు. బ్లాక్ కలర్ టీ షర్ట్, బ్యాగీ ప్యాంట్ వేసుకున్న వరుణ్.. క్రేజీగా ఉన్నారు. తన డ్యాన్స్ మాస్టర్ తో స్టైలిష్ స్టెప్పులు వేస్తూ సెల్ఫీ దిగారు. వరుణ్ యమా స్టైలిష్ గా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమాలో వరుణ్ అదరగొట్టేలా కనిపిస్తున్నారని చెబుతున్నారు.
ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వరుణ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా మట్కా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ తో మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, వరుణ్ తేజ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.