మూవీ రివ్యూ : మజాకా

Update: 2025-02-26 08:06 GMT

'మజాకా' మూవీ రివ్యూ

నటీనటులు: సందీప్ కిషన్-రావు రమేష్-రీతూ వర్మ-అన్షు-మురళీ శర్మ-అన్షు-రఘుబాబు-హైపర్ ఆది-శ్రీనివాసరెడ్డి తదితరులు

సంగీతం: లియోన్ జేమ్స్

ఛాయాగ్రహణం: నిజార్ షఫి

నిర్మాత: రాజేష్ దండ

రచన: ప్రసన్న కుమార్ బెజవాడ-సాయికృష్ణ

దర్శకత్వం: త్రినాథరావు నక్కిన

చాలా ఏళ్లు సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. అతను సినిమా చూపిస్త మావ.. నేను లోకల్.. హలో గురూ ప్రేమ కోసమే.. ధమాకా లాంటి హిట్లు ఇచ్చిన రైటర్-డైరెక్టర్ ద్వయం ప్రసన్న కుమార్ బెజవాడ-త్రినాథ రావు నక్కినతో కలిసి చేసిన చిత్రం.. మజాకా. రావు రమేష్.. రీతూ వర్మ.. అన్షు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి 'మజాకా' ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

వెంకట రమణ (రావు రమేష్).. కృష్ణ (సందీప్ కిషన్) తండ్రీ కొడుకులు. ఐతే వెంకట రమణ భార్య చనిపోవడంతో ఇంట్లో ఆడదిక్కు ఉండదు. అందుకే పెళ్లీడుకొచ్చిన కృష్ణకు వివాహం చేయడం కూడా కష్టమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ముందు తనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు వెంకట రమణ. మరోవైపు కృష్ణ.. ఓ అమ్మాయి ప్రేమలో పడతారు. ఇలా ఒకే సమయంలో తండ్రీ కొడుకులిద్దరూ ప్రేమ పాఠాలు వల్లెవేయడం మొదలుపెడతారు. ఈ విషయం ఒకరికొకరు తెలిసే సందర్భం వస్తుంది. అప్పుడా ఇద్దరూ ఎలా స్పందించారు.. తర్వాత తాము కోరుకున్న వాళ్లను ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోగలిగారా.. వెంకటరమణ కోరుకున్నట్లు వాళ్లింట్లో ఫ్యామిలీ ఫొటో తగిలించగలిగాడా.. అన్నది తెర మీదే చూడాలి.

కథనం-విశ్లేషణ:

రైటర్ ప్రసన్న కుమార్.. దర్శకుడు త్రినాథరావులది సూపర్ హిట్ జోడీ. 'సినిమా చూపిస్త మావ' నుంచి 'ధమాకా' వరకు వీళ్ళ కథలు రొటీన్ గానే అనిపిస్తాయి. కానీ మాస్ మెచ్చే కామెడీ.. యాక్షన్.. పాటలతో ఒక ప్యాకేజీ తరహా ఎంటర్టైన్మెంటుతో మాయ చేస్తూ వచ్చింది ఈ ద్వయం. ఈసారి మాత్రం సీన్ రివర్సయింది. వాళ్లు ఎంచుకున్న పాయింట్ కొంచెం భిన్నమైంది. కథలో చాలా మలుపులు కూడా ఉన్నాయి. కానీ గత సినిమాల్లో మాదిరి హై డోస్ వినోదాన్ని మాత్రం ఈ జోడీ అందించలేకపోయింది ఈ జోడీ. ఇందులో కామెడీ లేకపోలేదు. కొన్ని సీన్లు భలేగా అనిపిస్తాయి. డైలాగులూ బాగానే పేలాయి. కానీ ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ డోస్ మాత్రం సరిపోలేదు. బోలెడంత వినోదాన్ని పంచడానికి తగ్గ ప్లాట్ పాయింట్ కుదిరినా.. దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదనే ఫీలింగ్ కలుగుతుంది. కథ బాగున్నా.. కథనం సరిగా పండకపోవడంతో 'మజాకా' ఓ మోస్తరు స్థాయి సినిమాగా మిగిలింది. ఐతే ఇది ఒకసారి చూడ్డానికి ఢోకా లేని సినిమానే.

ఇంట్లో ఆడదిక్కు లేకపోవడం వల్ల కొడుక్కి పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతున్న తండ్రి.. తన వయసుకు తగ్గ ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలనుకోవడం ఇందులో కోర్ పాయింట్. ఎక్కువ తండ్రి.. మామ లాంటి పాత్రల్లోనే కనిపించే రావు రమేష్.. పువ్వు పట్టుకుని ఒక అమ్మాయి వెనుక తిరుగుతూ ప్రేమ పాఠాలు వల్లించే పాత్ర చేయడమే క్రేజీగా అనిపిస్తుంది. రావు రమేష్ లాంటి పెర్ఫామర్ కు ఇలాంటి పాత్ర పడితే.. వినోదం పండించడానికి మంచి స్కోప్ దొరికినట్లే. కానీ రావు రమేష్ ను ఒక స్థాయికి మించి దర్శకుడు ఉపయోగంచుకోలేదు. ఉదాహరణకు 'మజాకా'లో రావు రమేష్ లవ్ లెటర్ ద్వారా తన ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నించే ఒక సీన్ భలేగా అనిపిస్తుంది. బాగా నవ్వించే ఆ సీన్ చూశాక.. ఇలాంటివే సినిమా అంతా కోరుకుంటాం. కానీ మళ్లీ ఇంతలా నవ్వించే సీన్లు కొన్నే కనిపిస్తాయి సినిమాలో. ఎంటర్టైన్మెంట్ డోస్ ఆశించిన స్థాయిలో అందదు.

నెమ్మదిగా మొదలయ్యే 'మజాకా'లో రావు రమేష్ పాత్ర ప్రేమికుడిగా మారడంతోనే ఊపు వస్తుంది. ఆయనకు.. అన్షుకు మధ్య వచ్చే సన్నివేశాల్లో వినోదం పండింది. కానీ ఇంకో పక్క మెయిన్ హీరోహీరోయిన్లు సందీప్ కిషన్-రీతూ వర్మల మధ్య లవ్ స్టోరీ మాత్రం బోరింగ్ అనిపిస్తుంది. ఓవైపు రావు రమేష్ ట్రాక్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటే.. దానికి సమాంతరంగా సాగే సందీప్ కిషన్ లవ్ ఎపిసోడ్ మాత్రం విసిగిస్తుంది. తండ్రీ కొడుకుల మధ్య క్లాష్ నేపథ్యంలో వచ్చే సీన్లు మాత్రం పండాయి. ముఖ్యంగా హీరోలిద్దరూ ఒకే ఇంటి గోడ దూకి అక్కడ కథలోని అసలు ట్విస్టులన్నీ ఒకేసారి రివీలయ్యే సీన్ 'మజాకా'లో మేజర్ హైలైట్ గా నిలుస్తుంది. మున్ముందు బోలెడంత ఫన్ ఉండబోతున్న ఆశలు రేకత్తిస్తుంది ఆ సీన్. ప్రథమార్ధంలో సూపర్ అనిపించకపోయినా.. కథలో కొన్ని మలుపులు.. రావు రమేష్ ట్రాక్.. ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఓకే అనిపిస్తుంది.

ఐతే ఇంటర్వెల్ సమయానికే సుఖాంతం అయినట్లు కనిపించే కథలో మళ్లీ సమస్యను తీసుకొచ్చి.. ఆ తర్వాత దాని పరిష్కారం కనుక్కొనే నేపథ్యంలో మిగతా కథనాన్ని నడిపించారు. కానీ ఆ సమస్యా అంత పెద్దదిగా అనిపించదు. దాని పరిష్కారం కోసం హీరోలిద్దరూ చేసే పోరాటమూ అంత ఆసక్తికరంగా తోచదు. ఒక సీన్ మొదలవుతున్నపుడే అది ఎలా సాగుతుందో.. ముగియబోతుందో ఒక అంచనా వచ్చేస్తుంటే వాటిని ఎంజాయ్ చేయడం కష్టం. పైగా ఒకే రకమైన సీన్లు రిపీటవుతుంటాయి. దీని వల్ల 'మజాకా' ద్వితీయార్ధం రాను రాను బోర్ కొట్టిస్తుంది. రావు రమేష్.. హైపర్ ఆది పాత్రలతో కొంత కామెడీ పండించగలిగినా.. డోస్ మాత్రం సరిపోలేదు. మొదట్నుంచి కామెడీగా సాగే సినిమాకు చివర్లో ఎమోషనల్ టచ్ ఇవ్వాలని చూశారు. అది కొంత వర్కవుట్ అయింది. కామెడీలోనే కాక ఇక్కడ కూడా రావు రమేషే పాత్రే హైలైట్ అయింది. 'మజాకా' ఒక నాన్ స్టాప్ ఎంటర్టైనర్ కావడానికి తగ్గ ప్లాట్ పాయింట్ కుదిరినా.. సరైన సిచువేషన్లు కుదరక ఒక దశ దాటాక ఫన్ అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు. కామెడీ డోస్ ఇంకొంచెం పెంచి.. పాటలు సహా కమర్షియల్ హంగులూ మరింత బాగా కుదిరి ఉంటే.. 'మజాకా' త్రినాథరావు-ప్రసన్నల గత చిత్రాలను మించిన ఎంటర్టైనర్ అయ్యేది. ఐతే ఈ జోడీ గత సినిమాలను దృష్టిలో ఉంచుకుని మరీ ఎక్కువ ఆశించకుండా టైంపాస్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే 'మజాకా' ఓకే అనిపిస్తుంది.

నటీనటులు:

కృష్ణ పాత్రలో జాలీ టైప్ కుర్రాడిగా సందీప్ కిషన్ ఆకట్టుకున్నాడు. ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. తన కామెడీ టైమింగ్ బాగుంది. సందీప్ లుక్ బాగుంది. తన నటన అయితే కొత్తగా అనిపించదు. ఇక ఈ సినిమాకు అసలైన హీరో రావు రమేషే. ఆయన పెర్ఫామెన్సే చిత్రంలో హైలైట్ గా నిలుస్తుంది. నడి వయస్సులో ప్రేమ మైకంలో తేలిపోయే పాత్రలో కొన్ని సీన్లలో ఆయన ఆడ్ గా అనిపించినా.. తన పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం ఢోకా లేదు. ఆయన కామెడీ చేయడం కొత్త కాదు కానీ.. ఫుల్ లెంగ్త్ నవ్వులు పండించిన పాత్రల్లో ఇదొకటిగా నిలుస్తుంది. అదే సమయంలో ఎమోషన్ పండించాల్సిన చోటా రావు రమేష్ తన మార్కు చూపించాడు. ఈ సినిమా చూడాల్సింది రావు రమేష్ కోసమే. సందీప్ కు జోడీగా కనిపించిన రీతూ వర్మ పర్వాలేదు. మీరా పాత్రలో పెద్దగా నటించేందుకు స్కోప్ దక్కలేదు. గ్లామర్ పరంగా రీతూ ఓకే అనిపించుకుంది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించిన అన్షు చూడ్డానికి బాగుంది. కానీ రావు రమేష్ పక్కన ఆమె మరీ యంగ్ అనిపిస్తుంది. ఆ పాత్రలో ఇంకాస్త వయసు ఎక్కువగా కనిపించే నటినే తీసుకోవాల్సిందనిపిస్తుంది. లుక్స్ పరంగా ఆకట్టుకున్న అన్షు.. నటిగా అంత ప్రత్యేకంగా ఏమీ చేసింది లేదు. నెగెటివ్ షేడ్స్ ఉన్న కామెడీ క్యారెక్టర్లో మురళీ శర్మ బాగా చేశాడు. హైపర్ ఆది.. రఘుబాబు.. శ్రీనివాసరెడ్డి.. వీళ్లంతా కామెడీ క్యారెక్టర్లలో ఓకే అనిపించారు.

సాంకేతిక వర్గం:

'మజాకా'లో టెక్నికల్ వాల్యూస్ జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి. లియోన్ జేమ్స్ పాటలు సోసోగా అనిపిస్తాయి. త్రినాథరావు సినిమాల్లో మామూలుగా మంచి ఊపున్న పాటలు ఉంటాయి కానీ.. ఇందులో చార్ట్ బస్టర్స్ అనిపించే సాంగ్స్ లేకపోవడం మైనస్. పాటలు సినిమాలో అసందర్భోచితంగానూ అనిపిస్తాయి. నిజార్ షఫి ఛాయాగ్రహణం సినిమా నడతకు తగ్గట్లుగా సాగింది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. రైటర్లు ప్రసన్న కుమార్ - సాయికృష్ణ ఎంచుకున్న కోర్ పాయింట్ బాగుంది. మాటలు కూడా అక్కడక్కడా బాగానే పేలాయి. కానీ స్క్రీన్ ప్లే మాత్రం మరీ రొటీన్ టెంప్లేట్లో సాగిపోయింది. కొత్త సీన్లు పెద్దగా కనిపించవు. దర్శకుడు త్రినాథరావు తన మార్కు ఎంటర్టైన్మెంట్ స్టైల్లో ఈ కథను చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ కామెడీ పూర్తి స్థాయిలో వర్కవుట్ కాలేదు. ప్రథమార్థంలో కొన్ని సీన్ల వరకు ఆయన మసాలా బాగానే పని చేసింది కానీ... రెండో అర్ధంలో పిండికొద్దీ రొట్టె అన్నట్లు స్క్రిప్టుకు తగ్గట్లే ఎంటర్టైన్మెంట్ కూడా సోసోగా సాగింది.

చివరగా: మజాకా.. ఓ మోస్తరు మజా

రేటింగ్- 2.75/5

Tags:    

Similar News