లక్కీ బ్యూటీ.. 3 వారాల గ్యాప్ లో 3 సినిమాలు!

లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ.. ఈ మూడింటిలో ఏ రెండు హిట్టయినా మీనాక్షి కెరీర్ నెక్స్ట్ లెవల్ కు చేరుకునే అవకాశం వుంది.

Update: 2024-10-22 14:30 GMT

మీనాక్షి చౌదరి.. టాలీవుడ్ లో ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ప్రస్తుతం ఈ హర్యానా బ్యూటీ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఓవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే, మరోవైపు కుర్ర హీరోలకు జోడీగా అలరిస్తోంది. 2024లో ఇప్పటికే 'గుంటూరు కారం', 'సింగపూర్ సెలూన్', 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(ది గోట్) వంటి చిత్రాలతో సందడి చేసింది. ఇప్పుడు మరో మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిపోయింది.

మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన 3 తెలుగు సినిమాలు ఒకే సీజన్ లో విడుదలకు సిద్ధమయ్యాయి. ముందుగా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కు జోడీగా ఆమె నటించిన ''లక్కీ భాస్కర్'' చిత్రం దీపావళి కానుకగా అక్టోబరు 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇందులో సావిత్రి అనే మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ క్యారెక్టర్ లో మీనాక్షి కనిపించనుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో జనాల దృష్టిని ఆకర్షించింది.

మెగా హీరో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన పాన్ ఇండియా చిత్రం "మట్కా". ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నవంబరు 14న థియేటర్లలోకి రానుంది. అలానే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'మెకానిక్ రాకీ' మూవీలోనూ గార్జియస్ బ్యూటీ హీరోయిన్ పాత్ర పోషించింది. ఇది నవంబరు 22వ తేదీన విడుదల కానుంది. ఇలా మీనాక్షి 3 వారాల గ్యాప్ లో 3 సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

ఓకే సీజన్ లో మూడు సినిమాలు వస్తుండటంతో, మీనాక్షీ ప్రమోషన్స్ తో బిజీ అయిపోయింది. ఒకేసారి మూడు చిత్రాలకు ఈక్వల్ గా టైమ్ కేటాయిస్తూ, ప్రచారం చేస్తోంది. ఆన్ లైన్ ప్రమోషన్స్ తో పాటుగా ఆఫ్ లైన్ ప్రచారం కూడా మొదలుపెట్టింది. దీంతో రాబోయే నెల రోజుల పాటు మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అమ్మడి సందడే కనిపించనుంది. లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ.. ఈ మూడింటిలో ఏ రెండు హిట్టయినా మీనాక్షి కెరీర్ నెక్స్ట్ లెవల్ కు చేరుకునే అవకాశం వుంది.

ఫెమినా మిస్ ఇండియా హర్యానా టైటిల్ గెలుచుకున్న అందాల మీనాక్షి చౌదరి.. ఫెమినా మిస్ ఇండియా-2018 & మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2018 అందాల పోటీలలో ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత 'అప్‌స్టార్ట్స్' అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఖిలాడి మూవీ ఫ్లాప్ అయినా, 'హిట్ 2' చిత్రం మంచి హిట్ ఇచ్చింది.

మీనాక్షి చౌదరి ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ తో కలిసి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె ఒక పోలీస్ గా, వెంకీ మామా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే సంక్రాంతి పండక్కి రిలీజ్ చేస్తారా లేదా? అనే విషయం మీద క్లారిటీ రావడం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'విశ్వంభర' చిత్రంలో మీనాక్షి కీలక పాత్ర పోషిస్తోందని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News