అనుష్క గురించి మీనాక్షి కామెంట్స్‌..!

తాజాగా మీనాక్షి చౌదరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్‌ అనుష్క శెట్టి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Update: 2025-01-25 07:43 GMT

గత ఏడాది ఏకంగా ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. గత ఏడాదిలో దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించిన 'లక్కీ భాస్కర్‌' సినిమాతో మీనాక్షికి సూపర్‌ డూపర్ సక్సెస్ దక్కింది. ఇక ఈ కొత్త ఏడాది ఆరంభంలోనే వెంకటేష్ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సక్సెస్‌ దక్కింది. మీనాక్షి కెరీర్‌లోనే సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ విజయంగా నిలిచింది. సినిమాలో మీనాక్షి పోలీస్‌ ఆఫీసర్‌గా ఆకట్టుకుంది. ఆ పాత్రకు తగ్గట్లుగా సీరియస్‌, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ నటనతో మెప్పించింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్‌ హిట్ కావడంతో మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నవీన్ పొలిశెట్టితో ఒక సినిమాను చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు యంగ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లోనూ నటించే అవకాశాలు ఉన్నాయి. మీనాక్షి చౌదరి మంచి ఫిజిక్‌, బ్యూటీతో పాటు నటనతో అలరిస్తూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అందుకే మీనాక్షి చౌదరి కచ్చితంగా టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీ ఆర్టిస్టుగా ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మీనాక్షి చౌదరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్‌ అనుష్క శెట్టి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూ చేసిన యాంకర్‌ ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన వ్యక్తి, మిమ్ములను ఎక్కువగా ప్రభావితం చేసే వారు ఎవరు అని ప్రశ్నించిన సమయంలో మీనాక్షి చౌదరి ఏమాత్రం తడుముకోకుండా వెంటనే తనకు అనుష్క అంటే చాలా ఇష్టం అని, ఆమె ఎంతో పెద్ద స్టార్‌ అయినా చాలా సింపుల్‌గా ఉంటారు. తాను ఎప్పుడూ అనుష్క గారిని ఆదర్శంగా తీసుకుంటాను. ఒక వ్యక్తిగా ఆమెను తాను ఎంతగానో ఇష్టపడుతాను అంది. ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి. ఆమె ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవిస్తారు, ప్రతి ఒక్కరితోనూ మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు అందుకే ఆమె అంటే తనకు ఇష్టమని మీనాక్షి చెప్పుకొచ్చింది.

మీనాక్షి చౌదరి తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల నుంచి ఆఫర్లు దక్కించుకుంటుంది. హిందీలో ఈమె గతంలో నటించిన సినిమా నిరాశ పరచినా మళ్లీ అక్కడ నుంచి ఆఫర్లు వస్తున్నాయట. అయితే ఆచితూచి కొత్త సినిమా ఎంపిక చేసుకుంటుందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాలో మీనాక్షి చౌదరి నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం క్లారిటీ రాలేదు. ఆ వార్తలు పుకార్లే అని కొందరు అంటున్నారు. మరో వైపు అనుష్క ఘాటీ సినిమాతో ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Tags:    

Similar News