మెగా X అల్లు.. మూవీ రిలీజ్ అయ్యాక అంతా ఒకటే!
తన స్నేహితుడు కాబట్టి వెళ్లానని అల్లు అర్జున్ చెబుతున్నా.. మెగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగి మూడు నెలలకు పైగా అవుతోంది. కానీ అప్పుడు స్టార్ట్ అయిన మెగా, అల్లు ఫ్యామిలీల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం ఇప్పటికీ ఆగడం లేదు. కొన్ని పరిణామాలతో రోజురోజుకు పెరిగిపోతోంది. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి బన్నీ వెళ్లడంతో అప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన స్నేహితుడు కాబట్టి వెళ్లానని అల్లు అర్జున్ చెబుతున్నా.. మెగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
ఆ తర్వాత రీసెంట్ గా ఫారెస్ట్ స్మగ్లర్ రోల్స్ ను ప్రస్తుత హీరోలు చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్లు చేశారు. అవి పుష్ప సినిమాలోని బన్నీ రోల్ ను ఉద్దేశించినట్లు అనిపించడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడ్డారు. అసలు బన్నీ ఏం తప్పు చేశారని ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా కాంట్రవర్సీలోకి లాగుతున్నారని చెబుతున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రం.. తమ లిమిట్స్ క్రాస్ మరీ అల్లు అర్జున్ తోపాటు అల్లు అరవింద్ పై పోస్టులు పెడుతున్నారు. అయినా బన్నీ మాత్రం వాటిపై నోరు విప్పలేదు.
ఇటీవల మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా ఈవెంట్ లో తనకు ఇష్టమైతేనే వస్తానని వ్యాఖ్యానించారు. కానీ కొద్ది రోజులుగా జనసేన పార్టీకి చెందిన కొందరు నేతలు.. అల్లు అర్జున్ పై నోరు పారేసుకుంటున్నారు. బన్నీకి అస్సలు ఫ్యాన్సే లేరని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అసలు ఎవరు రమ్మన్నారని విమర్శించారు. ఆ తర్వాత మరో నేత.. నీడను ఇచ్చిన చెట్టునే బన్నీ విమర్శిస్తున్నారని ఆరోపించారు. పుష్ప-2 రిలీజ్ ను అడ్డుకుంటామని వివాదస్పదంగా మాట్లాడారు.
దీంతో జనసేన నేతలు.. కావాలనే బన్నీని టార్గెట్ చేస్తున్నారని టాక్ వస్తోంది. ఈ విషయంపై రీసెంట్ గా పవన్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాత రవిశంకర్ కు ప్రశ్న ఎదురైంది. జనసేన వాళ్లు కొద్దిగా టార్గెట్ పెట్టారుగా అని మీడియా ప్రతినిధి క్వశ్చన్ స్టార్ట్ చేయగానే.. ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ లాగా ఉందని రవిశంకర్ అనేసి నవ్వారు. అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా, బొల్లిశెట్టితోపాటు మరో నేత ఇటీవల మాట్లాడారు కదా.. అందుకే అడుగుతున్నా అని విలేకరి ప్రశ్నించారు.
దీంతో ఇవన్నీ సినిమా వచ్చే ముందు వరకే ఉంటాయి.. సినిమా చూశాక అందరం ఒకటేగా అన్నట్లు ఉంటుంది అని రవిశంకర్ తెలిపారు. "ఇలాంటివి ఎన్ని చూడలేదు గతంలో.. ఎంతోమందికి ఎన్నో రకాలుగా.. సినిమా బాగుంటే అన్నీ బాగుంటాయి.. ఇదేదో జస్ట్ టైమ్ బియింగ్ అంతే.. అక్కడ డిఫరెన్స్.. ఇక్కడ డిఫరెన్స్ అని చెప్పుకోవడమే గానీ.. అలాంటివి ఏం లేదు సార్.. ఫ్యామిలీ అంతా ఒకటే.. " అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిర్మాత రవిశంకర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మెగా ఫ్యామిలీ అంతా ఒకటేనని అనేక మంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.