మెగాస్టార్ మూడు ఫామ్‌హౌస్‌ల విలువ?

చిరంజీవి కొత్త ఆస్తి ఊటీలోని ఒక కొండపై ఉంది. దాని చుట్టూ పచ్చని టీ తోటలు ఉన్నాయి. ఈ భూమి విలువ‌ దాదాపు రూ. 16 కోట్లు.

Update: 2024-10-08 17:30 GMT

భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లోని బిగ్గెస్ట్ స్టార్లలో ఒకరైన చిరంజీవి నిరంత‌రం ఏదో ఒక కార‌ణంతో వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవల చిరు రియల్ పెట్టుబ‌డి గురించి ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. తమిళనాడులోని ఊటీలో సుందరమైన, ప్రశాంతమైన లొకేష‌న్ గా పాపుల‌రైన ఊటీలో అందమైన 6 ఎకరాల ఆస్తిని చిరంజీవి కొనుగోలు చేశారు. ఊటీ చాలా మంది సెలబ్రిటీలకు సుప‌రిచిత‌మైన‌ ప్రదేశం. ఇక్క‌డ ప‌లువురు స్టార్లకు ఫామ్ హౌస్ లు ఉన్నాయి. ఈ ఆస్తితో పాటు హైద‌రాబాద్, బెంగ‌ళూరు ప‌రిస‌రాల్లోను చిరంజీవికి కొన్ని ఎకరాల్లో ఫామ్ హౌస్ లు ఉన్న సంగ‌తి తెలిసిందే.

చిరంజీవి కొత్త ఆస్తి ఊటీలోని ఒక కొండపై ఉంది. దాని చుట్టూ పచ్చని టీ తోటలు ఉన్నాయి. ఈ భూమి విలువ‌ దాదాపు రూ. 16 కోట్లు. కొనుగోలుకు సంబంధించిన‌ అన్ని పత్రాలు రెడీ అయ్యాయి. ఇప్పుడు మెగాస్టార్ అద్భుతమైన లొకేషన్‌కు మరింత లగ్జరీని జోడించి ఆ స్థలంలో ఫామ్‌హౌస్‌ను నిర్మించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. చిరంజీవి కేవలం భూములు కొనడమే కాదు.. అతడు కలల ఫామ్‌హౌస్‌ని సృష్టిస్తున్నాడు. అతడి కుమారుడు రామ్ చరణ్ , అతడి భార్య ఉపాసన ఇప్పటికే ఊటీలో ఆస్తిని సందర్శించారు. ఫామ్‌హౌస్ డిజైన్ కోసం వారి ఆలోచనలను షేర్ చేసారు. నిర్మాణం త్వరలో ప్రారంభం కానుందని, అది ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు.

చిరంజీవి ఇతర ఆస్తుల గురించి ఇదే స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. చిరంజీవికి హైద‌రాబాద్ బెంగ‌ళూరు వంటి మెట్రో న‌గ‌రాలకు స‌మీపంలోను ఫామ్ హౌస్ లు ఉన్న సంగ‌తి విధిత‌మే. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో అతడికి ఫామ్‌హౌస్ కూడా ఉంది. సెలవులు, పండుగల సమయంలో కుటుంబసభ్యులతో కలిసి అక్కడే గడుపుతార‌నే విష‌యం తెలిసిన‌దే. ఈ ఫామ్ హౌస్ కొన్ని ఎక‌రాల్లో విస్త‌రించి ఉంద‌ని, దీనికి స‌మీపంలోనే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌హా ప‌లువురు స్టార్ల‌కు సొంత ఫామ్ హౌస్ లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇక దేవ‌న‌హ‌ళ్లి త‌ర్వాత వ‌న్య‌ప్రాణులు సంచ‌రించే ద‌ట్ట‌మైన అడ‌వులు ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్ విలువ సుమారు 40 కోట్లు పైగా ఉంటుంద‌ని కూడా గుస‌గ‌స‌లు వినిపించాయి.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన వాణిజ్య , నివాస స్థలాలలో ఒకటిగా ఉన్న కోకాపేట్‌లో సొంత‌ ఫామ్‌హౌస్‌ని కలిగి ఉన్నారు. 2019లో సైరా నరసింహారెడ్డి షూటింగ్ సమయంలో ఆస్తి లోపల అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ ఫామ్‌హౌస్ ప్ర‌ధానంగా చర్చల్లోకొచ్చింది. న‌గ‌ర విస్త‌ర‌ణ‌లో భాగంగా కోకాపేట భూములు ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా మారాయి. దీంతో చిరంజీవి ఫామ్ హౌస్ విలువ చాలా ఎక్కువ‌గా పెరిగింద‌ని స‌మాచారం. దీనివిలువ దాదాపు 200 కోట్లు పైగా ఉంటుంద‌ని కూడా టాక్ వినిపించింది.

ఓవైపు చిరంజీవి తన ఎస్టేట్ ప్లాన్‌లతో బిజీగా ఉండగానే, మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తన తాజా చిత్రం విశ్వంభర చిత్రీక‌ర‌ణ‌లోను పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా 10 జనవరి 2025న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Tags:    

Similar News