చిరు జాతీయ అవార్డ్ అలా మిస్సయ్యారు!
మెగాస్టార్ కి ఇప్పుడు పద్మవిభూషణ్ దక్కడంతో ఇప్పటికే తన ఖాతాలో రెండు పద్మాలు చేరినట్టయింది. అయితే తన కెరీర్ లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ లేకపోవడం అన్నది పెద్ద లోటు.
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ సత్కారంతో తన ఆనందోత్సాహాలను మీడియాతో పంచుకున్నారు. ఈ కీర్తి తన అభిమానులు శ్రేయోభిలాషుల ప్రేమతో దక్కినవని ఆయన అన్నారు. 2006లో పద్మభూషణ్ అందుకున్న మెగాస్టార్ కి ఇప్పుడు పద్మవిభూషణ్ దక్కడంతో ఇప్పటికే తన ఖాతాలో రెండు పద్మాలు చేరినట్టయింది. అయితే తన కెరీర్ లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ లేకపోవడం అన్నది పెద్ద లోటు. నిజానికి చిరు ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేదా? అంటే ఎందుకు లేవు? చివరి నిమిషంలో అంతా తారుమారైన సందర్భం కూడా ఉంది. నాటి ప్రభుత్వాలు, అవార్డు కమిటీల రాజకీయాలే దీనికి కారణమని విశ్లేషించేవారు లేకపోలేదు. ఎన్టీఆర్, చిరంజీవి సహా చాలా మంది తెలుగు తేజాలకు జాతీయ అవార్డులు లేకపోవడానికి అప్పటి రాజకీయాలే ప్రధాన కారణమని విశ్లేషిస్తారు. నిజానికి మెగాస్టార్ తన కెరీర్ లో ఎన్నో ఉత్తమమైన పాత్రల్లో అద్భుత నటనతో మెప్పించారు. 1990లలో చిరు తన ఉత్తమ నటనకు జాతీయ అవార్డును కోల్పోయారు.
ఇది ఏ సినిమాలో పెర్ఫామెన్స్? అంటే.. ఎలాంటి సందేహం లేకుండా కళాతపస్వి డా.కె.విశ్వనాథ్ తెరకెక్కించిన 'ఆపద్భాందవుడు'లోని నటప్రదర్శన గురించి చెప్పుకోవాలి. ఈ చిత్రంలో ఎంతో సహజంగా ఒదిగిపోయి నటించినందుకు చిరంజీవికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావాల్సి ఉంది. ఉత్తమ నటనకు గానూ జ్యూరీ అతని పేరును దాదాపు ఖరారు చేసిందని కూడా కథనాలొచ్చాయి. కానీ చివరి నిమిషంలో మార్పులు చిరంజీవి అవకాశాలను దెబ్బతీశాయి. అయినప్పటికీ చిరు తన అద్భుతమైన నటనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డును అందుకున్నారు.
నిజానికి చిరంజీవి 1980లు - 1990ల ప్రారంభంలో తన నటనలో బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించడానికి రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చేస్తూనే.. మధ్య మధ్యలో వాస్తవిక చిత్రాలతో అలరించారు. ప్రధానంగా డ్యాన్స్, ఫైటింగ్‌లకే పరిమితయ్యే సినిమాలు కాకుండా నటనకు ఆస్కారం ఉన్న వాటిని చిరంజీవి చేసారు. శంకరాభరణం-సాగర సంగమం వంటి విజయవంతమైన చిత్రాలతో పాపులరైన ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావుతో కలిసి తన కెరీర్‌లో స్వయంకృషి-ఆపద్భాంధవుడు అనే రెండు చిరస్మరణీయ చిత్రాలను అందించిన విషయాన్ని మరువకూడదు.
మెగాస్టార్ టాలీవుడ్‌లో తిరుగులేని కమర్షియల్ హీరోగా ఉన్నప్పటికీ చాలా సార్లు ప్రయోగాలతో సాహసోపేతమైన ఎంపికలతో ఆశ్చర్యపరిచారు. చిరంజీవి స్వయంకృషిలో కష్టపడి ధనవంతులయ్యే చెప్పులు కుట్టేవాడి పాత్రకు ప్రాణం పోసారు. దీనికోసం కొన్ని రోజుల పాటు నిజ జీవితంలో చెప్పులు కుట్టే వ్యక్తిని నిశితంగా గమనించారు చిరు. కమర్షియల్ బ్లాక్ బస్టర్ పసివాడి ప్రాణం తర్వాత ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కానీ దర్శకుడు కె విశ్వనాథ్ చెక్కిన డౌన్ టు ఎర్త్ పాత్రలోకి చక్కగా ఒదిగిపోయి నటించారు. ఘరానా మొగుడు లాంటి రికార్డ్ బ్రేకింగ్ హిట్ అందించిన తర్వాత ఆపద్భాందవుడు చిత్రంలో నటించారు చిరు. ఇమేజ్ మేకోవర్ చూపిస్తూ చిరు ఆవుల కాపరిగా నటించాడు. ఇందులో తన యజమానికి, ఆయన అభిమానించే కుమార్తె (మీనాక్షి శేషాద్రి)కి నమ్మకమైన సేవకుడిగా నటించారు.