వేశ్యలకు మద్దతు ప్రకటించిన ఆస్కార్ విన్నర్!
97వ ఆస్కార్ అవార్డుల్లో 'అనోరా' ఐదు విభాగాల్లో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రంగా 'అనోరా' అనే రొమాంటిక్ చిత్రం నిలిచింది.;
97వ ఆస్కార్ అవార్డుల్లో 'అనోరా' ఐదు విభాగాల్లో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రంగా 'అనోరా' అనే రొమాంటిక్ చిత్రం నిలిచింది. ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ ఇలా ఐదు విభాగాల్లో ఆస్కార్ వేడుకల్లో మెరిసింది 'అనోరా'. ఓ వేశ్య కథకు ఆస్కార్ వరించడం ఇదే తొలిసారి. కోటీశ్వరుడు కుమారుడి వేశ్య ప్రేమలో పడిన తర్వాత పరిస్థితులను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.
'అనోరా'లో అన్య అనే వేశ్య పాత్రలో మైకీ మాడిసన్ నటించింది. ఉత్తమ నటి అవార్డును మైకీ అందుకుని ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. పాత్రతో పాటు భావోద్వేగాలతో సినిమాకు ప్రాణం పోసింది. 'బెటర్ థింగ్స్', 'ఇంపోస్టర్స్' లాంటి షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. అటుపై 'లిజా లిజా స్కైస్ ఆర్ గ్రే' సినిమాతో వెండి తెరకు పరిచయమైంది.
అటుపై 'నోస్టాల్జియా', 'మాన్ స్టర్', 'వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ ది ఆడమ్స్ ఫ్యామిలీ' లాంటి చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. అయితే ఇవేవి ఆస్కార్ తేలేకపోయాయి. ఒక్క వేశ్య పాత్రతో ప్రపంచాన్నే నెగ్గింది. ఈ నేపథ్యంలో వేశ్యలను ఉద్దేశించి మైకీ మాడిసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'నేను లాస్ ఎంజిల్స్ లో పుట్టి పెరిగాను. కానీ హాలీవుడ్ ఎప్పుడూ నా నుంచి దూరంగా ఉన్నట్లే అనిపించింది. ఈరోజు నేను ఈ వేదిక పై ఉన్నానంటే? అదో అద్భుతంలా ఉంది. ఆస్కార్ తీసుకోవడం అన్నది ఓ కల. అది ఇప్పుడు నెరవేరింది. 'అనారో' సినిమాతో ఎంతో మంది వేశ్యలను కలిసాను. నేను ఇప్పుడు వారందర్నీ గౌరవించాలనుకుంటున్నాను. వారికి ఓ మిత్రు రాలిగా ఎల్లకాలం ఉంటాను. వాళ్లు పడే కష్టాలు గురించి తెలుసుకుంటే కన్నీళ్లు వచ్చాయి' అని తెలిపింది.
రష్యాకి చెందిన కోటీశ్వరుడి కుమారుడు చదువుకోవడానికి ఆమెరికా వెళ్తాడు. అక్కడ అనుకోకుండా ఓ వేశ్యని కలుస్తాడు. వారం పాటు తనతో ఉండేలా ఆ వేశ్యతో డబ్బులిచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాడు. కానీ కొన్ని రోజులకే వేశ్య ప్రేమలో పడి ఆమెని పెళ్లిచేసుకుంటాడు. కానీ ఈ విషయాలు ఇంట్లో తెలిసి ఆ కుర్రాడిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లిపోతారు.
దీంతో ఆ వేశ్య ఏమైందా? ఆ పరిస్థితిని ఎలా అధిగమించింది? ఈ కథ ఎలా కంచికి చేరింది? అన్నది కథ. ఇది వేశ్య కథ కావడంతో 18 ప్లస్ వారికే అనుమతి తో ఆడిన చిత్రమిది. థియేట్రికల్ రిలీజ్ లో ఈసినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. చాలా మంది ప్రేక్షకులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. సినిమాలో బోల్డ్ సన్నివేశాలున్నా? అవన్నీ కథలో భాగంగా వచ్చేవి. కమర్శియల్ కోణంలో ఎక్కడా జొప్పించినట్లు ఉండవు.
ద్వితియార్ధం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ ఆశ్చర్య పరుస్తుంది. ఇలా అడుగడుగునా సినిమా కి పాజిటివ్ వైబ్ ఉంది. ఎక్కడా విమర్శలు తలెత్తలేదు. అయితే 18 ఏళ్ల పైబడిన వారికే అనుమతి అంటే? సినిమా పై ఓ రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ ఈ కథలో మహిళను పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో పడుపు వృత్తికి ప్రేరేపిస్తాయి? అన్నది ఎంతో గొప్పగా హైలైట్ అయింది. ఆ సన్నివేశాల్ని ఎంతో హృద్యంగానూ హైలైట్ చేసారు. దీంతో మరో ఆలోచన లేకుండా ఆస్కార్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.