పవన్ పాట ఏమంత బాగా లేదా..?

మేకర్స్ తాజాగా 'మాట వినాలి' అనే మొదటి పాటను విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేశారు. అయితే ఈ సాంగ్ కి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.

Update: 2025-01-17 13:30 GMT

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ''హరి హర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ Vs స్పిరిట్''. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కొంత భాగం తెరకెక్కగా.. మిగిలిన భాగాన్ని జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. అప్పుడెప్పుడో సెట్స్ మీదకి వెళ్లిన ఈ ప్రాజెక్ట్ వివిధ కారణాలతో నెమ్మదిగా ముందుకు సాగుతూ వచ్చింది. మేకర్స్ తాజాగా 'మాట వినాలి' అనే మొదటి పాటను విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేశారు. అయితే ఈ సాంగ్ కి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.

"మాట వినాలి గురుడా మాట వినాలి.. మాట వినాలి గురుడా మంచి మాట వినాలి" అంటూ సాగిన ఈ పాటను పవన్ కల్యాణ్ స్వయంగా ఆలపించారు. జానపద శైలిలో ఎంఎం కీరవాణి ఈ గీతానికి ట్యూన్ చేయగా.. పెంచల్ దాస్ సాహిత్యం రాశారు. అయితే ఈ పాట ఏమంత గొప్పగా లేదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మ్యూజిక్ బాగానే ఉంది కానీ, ఎందుకనో అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు. మంచి లిరిక్స్ కూడా పడలేదని అభిప్రాయ పడుతున్నారు.

ప్రారంభంలో తెలంగాణ స్లాంగ్ లో కొన్ని మాటలు చెప్పిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత ఆంధ్రా జానపదం స్టైల్ లో పాట పాడినట్లుగా అనిపిస్తుంది. ఆయన చేతిలో కంజర పట్టుకొని కొన్ని సింపుల్ స్టెప్పులు కూడా వేశారు. అయితే కొరియోగ్రఫీ ఎవరు చేశారో తెలియదు కానీ, పవన్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేసే స్టెప్పును రిపీట్ చేసినట్లుగా యాంటీ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇది పాటలా అనిపించడం లేదని, పవన్ మాట్లాడినట్లే ఉందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం 'మాట వినాలి' సాంగ్ నెక్స్ట్ లెవల్ లో ఉందని పోస్టులు పెడుతున్నారు. రెండున్నర నిమిషాల ఈ పాటను 1.2X స్పీడ్ లో వింటే చాలా బాగుందని చెబుతున్నారు. తెలుగులో కంటే ఇతర భాషల్లో ఈ పాట ఇంకా బెటర్ గా ఉందని మరికొందరు అంటున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అన్ని భాషల్లోనూ పవన్ స్వయంగా పాడి వినిపించడం గమనార్హం.

పవన్ కల్యాణ్ గతంలో పలు సినిమాలకు తన గొంతును సవరించుకున్నారు. తమ్ముడు, ఖుషీ, జానీ, గుడుంబా శంకర్, పంజా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి చిత్రాలలో కొన్ని ఫోక్ సాంగ్స్ పాడారు. చివరగా 'కొడకా కోటేశ్వరరావు' పాటతో అభిమానులను అలరించారు. ఇప్పుడు "హరి హర వీరమల్లు" మూవీలో 'మాట వినాలి' పాటను పాన్ ఇండియా ఆడియన్స్ కు వినిపించడానికి రెడీ అయ్యారు. ముందుగా ఈ సాంగ్ ను జనవరి 6వ తేదనే విడుదల చేయాలని అనుకున్నారు కానీ కుదరలేదు. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత ఈరోజు రిలీజ్ చేశారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 28న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

Full View
Tags:    

Similar News