మోహన్ బాబు@EK527
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు మీద క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే.
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు మీద క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. చిన్న కొడుకు మంచు మనోజ్ తో గొడవ జరుగుతున్న నేపథ్యంలో, కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధిపై దాడి చేయడం మోహన్ బాబును ఇబ్బందుల్లోకి నెట్టింది. జర్నలిస్టు తీవ్రంగా గాయపడటంతో, ఆయనపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. అయితే కోర్టు ఇచ్చిన గడువు పూర్తయినా మోహన్ బాబు విచారణకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కేసు ఫైల్ చేసినప్పుడే విచారణకు రావాల్సిందిగా మోహన్ బాబుకు పోలీసులు నోటీసులిచ్చారు. అయితే ఆరోజు జరిగిన ఘర్షణలో మోహన్ బాబు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో డిసెంబరు 24 వరకూ విచారణకు హాజరుకాలేనని మోహన్ బాబు ప్రత్యేక అనుమతులు తెచ్చుకున్నారు. అదే సమయంలో మధ్యంతర బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది.
మోహన్ బాబు ముందు పోలీసుల విచారణకు హాజరవ్వాలని, ఆ తర్వాత కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. ఓవైపు కోర్టు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేయడం, మరోవైపు పోలీసులు ఇచ్చిన గడువు మంగళవారం ముగియడంతో మోహన్ బాబును కచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు వెళ్తారా లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతలోనే మోహన్ బాబు ఇండియా లో లేరు దుబాయ్ లో ఉన్నారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
మోహన్ బాబు ప్రస్తుతం ఇండియాలో లేరని, ఇప్పటికే దుబాయ్‌కి వెళ్లి పోయారంటూ ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ నుంచి వెళ్ళే 'ఎమిరేట్స్ EK 527' ఫ్లైట్ లో ఆయన దుబాయ్ కి వెళ్లినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. హైకోర్టు ముందస్తు బెయిల్ కు నిరాకరించడం, కోర్టు ఇచ్చిన రిలీఫ్ ముగియనుండటంతో ముందు జాగ్రత్తగా ఆయన దేశం దాటి వెళ్లినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
కొన్ని రోజుల క్రితం పుకార్లే వచ్చాయి. అయితే తాను ఎక్కడికీ వెళ్లలేదని, ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు మోహన్ బాబు అందుబాటులో లేరనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికైతే మంచు ఫ్యామిలీ స్పందించలేదు. ఒకవేళ మోహన్ బాబు పోలీసుల విచారణకు హాజరుకాకపోతే మాత్రం, ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
నిజానికి మంచు ఫ్యామిలీలో వివాదం గత కొన్ని రోజులుగా మీడియాకి, సోషల్ మీడియాకి హాట్ టాపిక్ గా నడిచింది. మనోజ్ తో ఘర్షణ జరుగుతున్న సమయంలో సహనం కోల్పోయిన మోహన్ బాబు.. రిపోర్టర్ రంజిత్ చేతిలోని మైకు లాక్కుని కొట్టడంతో తలకు బలమైన గాయం తగిలింది. ఈ దాడిని జర్నలిస్టు సంఘాలన్నీ ఖండించాయి. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఉన్న మెహన్ బాబు.. తన తప్పుకు చింతిస్తున్నట్లుగా ఓ ఆడియో విడుదల చేసారు.
ఇదే క్రమంలో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ తాను ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని అన్నారు. జర్నలిస్ట్ కి క్షమాపణలు చెప్పడంతో పాటు, ఆయన కుటుంబ సభ్యులకు, అలాగే ఆయన పని చేస్తున్న మీడియా సంస్థకు కూడా క్షమాపణలు చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాత మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు స్వయంగా వెళ్లి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్‌ను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రంజిత్ తో పాటుగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా మరోసారి సారీ చెప్పారు. అయినప్పటికీ ఈ కేసులో మోహన్ బాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలంగాణా డీజీపీ జితేందర్ తెలిపారు.