మోహన్ బాబు బయోపిక్... సూర్య ఒప్పుకుంటాడా?
అంతే కాకుండా ఆ బయోపిక్‌కి తానే నిర్మాతగా వ్యవహరిస్తానని విష్ణు పేర్కొన్నాడు.
మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విష్ణు ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇటీవల కన్నప్ప సినిమా ప్రమోషన్‌లో భాగంగా మంచు విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలో తన తండ్రి మోహన్ బాబు బయోపిక్ గురించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు గారి బయోపిక్ తీయాలనే ఆలోచన ఉన్నట్లు ఆయన మాట్లాడారు. తన తండ్రి బయోపిక్ తీస్తే అందులో లీడ్ రోల్‌ను తమిళ్ స్టార్ హీరో సూర్యతో చేయించాలని తాను కోరుకుంటాను అని మంచు విష్ణు అన్నాడు. అంతే కాకుండా ఆ బయోపిక్‌కి తానే నిర్మాతగా వ్యవహరిస్తానని విష్ణు పేర్కొన్నాడు.
కంగువా సినిమా టీజర్ చూసి ఆశ్చర్యపోయాను. అద్భుతమైన నటనతో సూర్య సర్‌ప్రైజ్ చేశారు. విజువల్స్ వండర్‌గా కంగువాను రూపొందించారని మంచు విష్ణు అన్నాడు. ప్రస్తుతానికి మోహన్ బాబు బయోపిక్ గురించి ఆలోచన లేదు. కానీ తీస్తే కచ్చితంగా సూర్యతోనే తీయాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. మరి మోహన్ బాబు బయోపిక్‌కి సూర్య ఒప్పుకుంటాడా అనేది పెద్ద ప్రశ్న. మోహన్ బాబు సినీ కెరీర్ డౌన్ టు ఎర్త్ అన్నట్లు సాగిందనే విషయం తెల్సిందే. ఒక చిన్న నటుడిగా మోహన్ బాబు కెరీర్ ప్రారంభం అయ్యింది. చాలా కష్టపడి, ఒడిదొడుకులు ఎదుర్కొన్న తర్వాత మోహన్ బాబు స్టార్‌గా నిలిచారు. స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా భారీ విజయాలను సొంతం చేసుకున్నారు.
500లకు పైగా సినిమాలు చేసిన మోహన్ బాబు సినీ కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదొడుకులు ఉన్నాయి. సినిమాటిక్ పరిణామాలు చాలానే ఉంటాయి. కనుక బయోపిక్ తీస్తే కచ్చితంగా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మంచు విష్ణుకు ఇప్పుడు వెంటనే బయోపిక్ చేయాలనే ఆలోచన లేదు, కానీ భవిష్యత్తులో తండ్రిపై ఉన్న అభిమానం, గౌరవంతో బయోపిక్‌ను రూపొందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు అంటూ మంచు ఫ్యామిలీ అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మంచు ఫ్యామిలీతో సూర్యకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో సూర్య హీరోగా నటించి సూపర్ హిట్ అయిన సూరరై పోట్రు సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కూడా చాలా సార్లు మోహన్ బాబు ఫ్యామిలీతో సూర్య కలవడం మనం చూస్తూనే ఉన్నాం. మోహన్ బాబు అంటే తనకు చాలా గౌరవం అని సూర్య గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కనుక మంచు విష్ణు చేయాలనుకుంటున్న ప్రయత్నంకు సూర్య సహకరిస్తారా అనేది చూడాలి. అయితే మోహన్ బాబు హైట్‌కి సూర్య హైట్‌కి మ్యాచ్ కాదు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నా.. అది పెద్ద సమస్య కాకపోవచ్చు. మోహన్ బాబు సినీ జర్నీ ఎంతో మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు. అలాంటి మోహన్ బాబు బయోపిక్‌లో నటించడం సూర్య గౌరవంగా భావించే అవకాశాలు ఉన్నాయి. కనుక విష్ణు గట్టిగా ట్రై చేస్తే సూర్య ఒప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.