నాని ని ఢీ కొట్టడానికి కలెక్షన్ కింగ్ నే దించుతున్నారా?
అటు నాని `హిట్-3` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ పూర్తవ్వడం...నాని హిట్ -3 నుంచి రిలీవ్ అవ్వగానే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
నేచురల్ స్టార్ నాని-`దసరా` పేం శ్రీకాంత్ మరోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. `దసరా` తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మరో భారీ ప్రాజెక్ట్ ఇది. ఇటీవలే సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. అటు నాని `హిట్-3` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ పూర్తవ్వడం...నాని హిట్ -3 నుంచి రిలీవ్ అవ్వగానే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
ఈ చిత్రాన్ని నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా మలుస్తున్నారుట. నాని నటించిన సినిమాలు వంద కోట్ల వసూళ్లను సాధించాయి. కానీ ఇంతవరకూ 100 కోట్ల బడ్జెట్ ఏ సినిమాకు ఖర్చు చేయలేదు. తొలిసారి ఈ సినిమా కోసం 100 కోట్లు పైనే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చిత్రాన్ని భారీ కాన్వాస్ పైనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కోసం స్టార్ నటులు...ఫస్ట్ క్లాస్ టెక్నీషియన్లను రంగంలోకి దించుతున్నారు.
మోహన్ బాబు-రమ్యకృష్ణలు కీలక పాత్రలకు చర్చలు జరుపుతున్నారుట. మోహన్ బాబు ఇందులో విలన్ పాత్రకు ఒప్పిస్తున్నట్లు సమాచారం. మోహన్ బాబు కెరీర్ విలన్ పాత్రలతోనే మొదలైంది. అటుపై హీరోగా మారారు. ఆ తర్వాత మళ్లీ విలన్ పాత్రల జోలికి వెళ్లలేదు. మళ్లీ ఇంత కాలానికి విలన్ రోల్ తో మోహన్ బాబు పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. మోహన్ బాబు ఒప్పుకుంటే గనుక భారీ మొత్తంలో పారితోషికం చెల్లిచాల్సి ఉంటుంది.
ఆయన విలన్ పాత్ర అంటే సినిమాకి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుంది. డైలాగ్ కింగ్ గా అతడికి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. చాలా కాలంగా ఆయన కూడా సినిమాలు చేయడం తగ్గించారు. సొంత బ్యానర్లో తప్ప బయట బ్యానర్లలో సినిమాలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో నాని సినిమా లో మోహన్ బాబువిలన్ రోల్ అన్నది సినిమాని అమాంతం పైకి లేపే అంశమే. రమ్యకృష్ణ కూడా కీలక పాత్ర అంటే? సినిమాకి అన్ని రకాలుగా కలి సొస్తుంది. `బాహుబలి`లో శివగామి పాత్రతో ఆమె పాన్ ఇండియాలో ఎంతో ఫేమస్ అయ్యారు. అలాంటి నటి భాగమైతే సినిమాకి ప్లస్ అవుతుంది.
అలాగే ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా వర్షంలోనే ఉంటుందిట. దానికి సంబంధించి ప్రత్యేకమైన సెట్లు....సెటప్ అంతా సిద్దం చేస్తున్నారుట. సినిమా షూటింగ్ మాత్రమే 200 రోజులు ఉంటుందిట. ఆ రకంగా నాని కెరీర్ కి ఇదో రికార్డు. ఇంత వరకూ ఆయన ఏ సినిమా కోసం అన్ని రోజులు పనిచేయలేదు. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నట్లు సమాచారం. `ది ప్యారడైజ్` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.