AR రెహమాన్ నాకు తండ్రి లాంటివారు: బాసిస్ట్ మోహిని డే
AR రెహమాన్ -సైరా బాను 29 సంవత్సరాల దాంపత్య జీవితం నుంచి విడిపోవడం ఆశ్చర్యం కలిగించింది.
AR రెహమాన్ -సైరా బాను 29 సంవత్సరాల దాంపత్య జీవితం నుంచి విడిపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన అభిమానులతో పాటు ప్రపంచం ఈ విడాకుల ప్రకటనతో నివ్వెరపోయింది. అయితే రెహమాన్- సైరా భాను ఉమ్మడి ప్రకటన రోజున కొన్ని గంటల వ్యవధిలో రెహమాన్ బాసిస్ట్ మోహిని డే తన భర్త నుండి విడిపోయానని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. బాసిస్ట్ మోహిని కారణంగానే ఆ జంట విడిపోయారని మీడియా ఊహాగానాలను ప్రచురించడంతో రెహమాన్ దానిని వెంటనే ఖండించారు. ఆయన చట్టబద్ధమైన చర్యలకు సిద్ధమయ్యారు.
రెహమాన్ - మోహిని డే ఇద్దరూ తమపై సాగుతున్న ప్రచారాన్ని గట్టిగా ఖండించారు. రెహ్మాన్ కుమారుడు AR అమీన్ నిరాధారమైన పుకార్లపై ఆవేదన చెందగా, రెహమాన్ భార్య సైరా భాను.. రెహమాన్ కి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయన మంచి మనిషి.. తప్పుడు ప్రచారం తగదని మీడియాను హెచ్చరించారు.
ఇప్పుడు మోహిని డే ఇన్‌స్టా వీడియో ద్వారా తమపై సాగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఏ.ఆర్.రెహమాన్ తనకు తండ్రి వంటి వారని అన్నారు. ``అసలు సంబంధం లేని రెండు సంఘటనలను మీడియా ఎలా సంచలనం చేసిందో చూస్తే నిరుత్సాహంగా ఉంది. AR రెహమాన్ నాకు తండ్రి లాంటివారు. నేను అతనితో 8.5 సంవత్సరాలు పనిచేసినందుకు ఎంతగానో గౌరవిస్తాను. నా వయసు ఆయన కుమార్తె వయసుతో సమానం. మీడియా సున్నిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మా గోప్యతను గౌరవించాలి`` అని అన్నారు. వ్యక్తిగత విషయాలపై ఈ ప్రచారాన్ని ఖండిస్తూ నిరాశను వ్యక్తం చేశారు. తమ గోప్యతను గౌరవించాల్సిందిగా మోహని డే మీడియాను వ్యక్తిగతంగా అభ్యర్థించారు.