భారతదేశంలో అత్యధిక థియేటర్లు ఉన్న రాష్ట్రం?
ఒక సర్వే ప్రకారం.. భారతదేశంలో అత్యధిక థియేటర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
భారతదేశంలో అత్యధిక సంఖ్యలో సినిమా థియేటర్లు ఉన్న రాష్ట్రం ఏది? తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో థియేటర్ల సంఖ్య ఎంత? ర్యాంకింగ్స్ లో మన స్థానం ఎక్కడ? ఉత్తరాదిన థియేటర్లు ఎక్కువా? దక్షిణాదిన థియేటర్లు ఎక్కువా? తెలుసుకోవాలనుకుంటే వివరంలోకి వెళ్లాలి.
ఒక సర్వే ప్రకారం.. భారతదేశంలో అత్యధిక థియేటర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ 5వ స్థానంలో ఉంది. దేశంలో మొత్తం 6,877 థియేటర్లు ఉండగా, అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఇండియా ఇన్ పిక్సెల్స్ అధ్యయనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక థియేటర్లు 1,097 ఉన్నాయి. ఏపీ తర్వాత తమిళనాడులో 943, కర్ణాటకలో 719, మహారాష్ట్రలో 703, తెలంగాణలో 485 థియేటర్లు ఉన్నాయి. టాప్ 5లో నాలుగు దక్షిణాది రాష్ట్రాలకే చోటు దక్కడం విశేషం.
నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఎక్కువ థియేటర్లు ఉండేవి. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 2,000 థియేటర్లు ఉండేవి. కానీ వాటి సంఖ్య తగ్గింది. పాత రోజుల్లో సింగిల్ స్క్రీన్లకు గొప్ప పాపులారిటీ ఉండేది. కానీ మల్టీప్లెక్స్ కల్చర్ లో సింగిల్ థియేటర్లు మనుగడను కోల్పోయాయి. కార్పొరెట్ ప్రవేశించి సింగిల్ థియేటర్లను మాల్స్, మల్టీప్లెక్సులుగా మార్చే ట్రెండ్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మొదటి ఐనాక్స్ విజయవాడకు వచ్చింది. విజయవాడలో తొలి శాశ్వత థియేటర్ గా ఇది పాపులరైంది. హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కువ మల్టీప్లెక్సులు ఉన్నాయి. విజయవాడ, వైజాగ్ లోను మల్టీప్లెక్స్ కల్చర్ విస్త్రతంగా పెరిగింది.
ఉత్తరాదిన ఎన్ని థియేటర్లు?
ఇటీవల పుష్ప 2 చిత్రం ఉత్తరాది నుంచి ఏకంగా 600 కోట్లు పైగా వసూలు చేసింది. నిజానికి మెజారిటీ థియేటర్లు దక్షిణాదిన ఉండగా, ఈ సినిమా ఉత్తరాది నుంచి అదిరిపోయే వసూళ్లను కొల్లగొట్టడం ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఉత్తరాది రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య ఎలా ఉంది? అన్నది పరిశీలిస్తే...గుజరాత్ -420, బెంగాల్-373, ఉత్తర ప్రదేశ్-321, బీహార్ -315, మధ్యప్రదేశ్-188, రాజస్తాన్ -178, ఒడిసా-141, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో 100లోపు థియేటర్లు ఉన్నాయి. అయితే ఉత్తరాదిన అత్యధిక థియేటర్లు కలిగి ఉన్న రాష్ట్రం - మహారాష్ట్ర. ఈ రాష్ట్రంలో ఏకంగా 703 థియేటర్లు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రమైన కేరళలో 289 థియేటర్లు ఉన్నాయి. ఓవరాల్ గా దక్షిణాది రాష్ట్రాల్లో 3,533 థియేటర్లు ఉండగా, ఉత్తరాదిన సుమారు 2,759 థియేటర్లు ఉన్నాయి. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన ఎక్కువ థియేటర్లు ఉన్నాయి.