థియేటర్లలో మందు కొట్టాలంటే బంపరాఫర్!
ఇకపై సినిమా థియేటర్లలో తాగి తూలొచ్చు. మత్తు ఎక్కకుండానే తూలి పడే ప్రజలకు ఇది బంపరాఫర్.;

ఇకపై సినిమా థియేటర్లలో తాగి తూలొచ్చు. మత్తు ఎక్కకుండానే తూలి పడే ప్రజలకు ఇది బంపరాఫర్. ఒక చుక్క మద్యం పడిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటిది ఇక మీదట థియేటర్‌ని బార్ గా మార్చి ఆల్కహాల్ ని అందించేందుకు ప్రయత్నిస్తున్నారని కథనాలొస్తున్నాయి. ప్రముఖ మల్టీప్లెక్స్ చెయిన్ తమ థియేటర్లలో సినిమాలు చూసే ఆడియెన్ కి మద్యం మత్తును అందించేందుకు ప్రయత్నిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
జనాల్ని ఏదో ఒక మిషతో థియేటర్లకు రప్పించాలనేది ప్రణాళికలో భాగం అయినా ఇలా మద్యం మత్తులో సినిమాలు చూపించే ప్రయత్నం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఏడాది కాలంగా దీనిపై మీడియాలో వైరల్ గా కథనాలొస్తున్నాయి. ఓటీటీలు, డిజిటల్ విప్లవం కారణంగా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న థియేటర్ల రంగం తీవ్రంగా నష్టపోతోంది. సినిమా హాళ్లకు జనాల్ని రప్పించడం ఇటీవల కష్టంగా మారింది. అయితే ఈ పరిస్థితిని మార్చేందుకు మల్టీప్లెక్సులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వస్తోంది. ఇటీవల మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరలను తగ్గించి అమ్మడం ప్లస్ అయింది. జనాలు ఏది ఇష్టపడితే దానిని మల్టీప్లెక్సుల్లో అందించే ప్రయత్నాలకు వెల్ కం చెబుతున్నారు.
ఇక ప్రేక్షకుడి అనుభవాన్ని ఉత్తమంగా మార్చేందుకు బెంగళూరు, గుర్గావ్‌లలోని థియేటర్లలో మద్యం అమ్మేందుకు లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. తాగుతూ ఇష్టమైన సినిమా చూడటం అనే కాన్సెప్ట్ యాజమాన్యాలకు లాభదాయకం. కానీ సినిమా చూసేందుకు వచ్చిన ఫ్యామిలీ ఆడియెన్ మాత్రం సమస్యల్లో పడ్డట్టేనని భావిస్తున్నారు.
తాగిన వ్యక్తి పక్క సీట్లో కూచుంటే అతడితో ఫ్యామిలీ ఆడియెన్ కలిసి సినిమా చూడగలరా? పిల్లలతో కలిసి అలాంటి చోట సినిమాలు చూడటం పాజిబులేనా? చీకటి హాలులో మద్యం మత్తు పర్యవసానం ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించగలరా? ఇలాంటి ఎన్నో సందేహాలున్నాయి. ముఖ్యంగా యూత్, పిల్లల పరిస్థితేమిటి? పాప్ కార్న్, బిస్కెట్లు, ఐస్ క్రీములకు బదులుగా ఇకపై మద్యంపైనే యూత్ ఖర్చు చేసేందుకు వెనకాడరు! థియేటర్లలో టికెట్ ధరలు సహా తిండి పదార్థాలు, కోలాల ధరలే మండిపోతున్నాయి. ఇప్పుడు ఆల్కహాల్ ధరల భారం కూడా అదనంగా మారనుంది. జనాల్ని థియేటర్లకు రప్పించడానికి మత్తు అలవాటు చేసే విధానాన్ని మల్టీప్లెక్సులు పునఃపరిశీలిస్తాయేమో చూడాలి.