మలయాళంలో మరో మెగా మల్టీస్టారర్
ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ దర్శకుడు మహేష్ నారాయణన్ తెరకెక్కిస్తున్నారు.
మలయాళ సినీ పరిశ్రమలో సంచలన ప్రాజెక్ట్ మొదలైంది. రెండు దశాబ్దాల తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి తెరపై కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ దర్శకుడు మహేష్ నారాయణన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీలంకలో ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మోహన్ లాల్ దీపారాధన చేయగా, సహ నిర్మాతలు సుభాష్ జార్జ్ మాన్యువల్ కెమెరా స్విచ్ ఆన్ చేయడం విశేషం.
ఈ భారీ మల్టీస్టారర్‌లో ఫహాద్ ఫాజిల్, కుంచాకో బోబన్, నయనతార ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్‌ను జోసెఫ్ నిర్మిస్తుండగా, సహ నిర్మాతలుగా సీఆర్ సలీం, సుభాష్ జార్జ్ మాన్యువల్ వ్యవహరిస్తున్నారు. రజేష్ కృష్ణ, సివి శారథి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాలో కేవలం స్టార్స్ మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ నటీనటులు రంజి పణికర్, రాజీవ్ మీనన్, దానిష్ హుసైన్, దర్శనా రాజేంద్రన్, శరిన్ షిహాబ్, ప్రఖ్యాత థియేటర్ ఆర్టిస్ట్ ప్రకాశ్ బెలవడి వంటి వారు కూడా కనిపించనున్నారు.
ఈ చిత్రానికి మణుష్ నందన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. శ్రీలంక, లండన్, అబు ధాబి, అజర్ బైజాన్, థాయ్ లాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చి వంటి ప్రముఖ లొకేషన్లలో 150 రోజుల పాటు చిత్రీకరించనున్నారు. ఇది ఈ చిత్రానికి మరో ప్రత్యేకతగా నిలుస్తుంది. మలయాళం ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో ఒక న్యూ డిఫరెంట్ ప్రాజెక్టుగా ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది.
ఇక మేకప్ కోసం రంజిత్ అంబాడి, ప్రొడక్షన్ డిజైన్ కోసం జోసెఫ్ నెల్లికల్ వంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. మరింత ప్రత్యేకతగా, ప్రొడక్షన్ కంట్రోల్ డిక్సన్ పొడుతాస్ చేతిలో ఉంది. ఫాంటమ్ ప్రవీణ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, లిను ఆంటోనీ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మోహన్ లాల్, మమ్ముట్టి వంటి దిగ్గజాల నటన నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందట.
ఇక మహేష్ నారాయణన్ దర్శకత్వ వహించడంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ సినిమా మలయాళ సినీ చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ఏఎన్ఎన్ మెగా మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరోసారి మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ అదరగొట్టబోతోందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.