తమిళ హీరోతో మైత్రి జాక్ పాట్ ప్లాన్!

టీజర్, ట్రైలర్ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయినా, తమిళనాట అజిత్ మాస్ క్రేజ్‌తో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

Update: 2025-02-06 16:30 GMT

ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్ లేటెస్ట్ మూవీ పట్టుదల (విడాముయార్చి) మొదట్లో అంతగా హైప్ లేకుండా కనిపించినా, విడుదల తర్వాత మంచి స్పందన తెచ్చుకుంటోంది. టీజర్, ట్రైలర్ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయినా, తమిళనాట అజిత్ మాస్ క్రేజ్‌తో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అయితే, తెలుగు మార్కెట్‌లో మాత్రం ఈ సినిమాపై చాలా తక్కువ అంచనాలు ఉండటంతో, ఇక్కడ బిజినెస్ పరంగా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

హాలీవుడ్ స్టైల్ కథా నేపథ్యంలో తీశారు కాబట్టి, మాస్ ఆడియెన్స్‌కు అంతగా కనెక్ట్ కావడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే, తమిళనాట మాత్రం అజిత్ తన స్టార్ పవర్ ఏమిటో మరోసారి నిరూపిస్తున్నాడు. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా తెగింపు, గోట్ స్థాయిలో ఓపెనింగ్స్ నమోదు చేస్తూ, భారీ రన్‌ను కొనసాగిస్తోంది. యూఎస్ ప్రీమియర్ల టాక్ మిశ్రమంగా ఉన్నప్పటికీ, అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల తమిళనాట భారీ వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక, ఈ సినిమా విజయంతో మరో అంశం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ చిత్రం నిర్మాత మైత్రి మూవీ మేకర్స్‌కి ఇది గోల్డ్ మైన్‌లా మారే అవకాశముంది. ఎందుకంటే, అజిత్ తదుపరి చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా వీరే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ సినిమాపై భారీ బజ్ నడుస్తోంది. ముఖ్యంగా, ఈ చిత్రంలో అజిత్ ఊర మాస్ లుక్‌తో కనిపించనున్నాడని తెలుస్తోంది. గతంలో గ్యాంబ్లర్ సినిమా తర్వాత అజిత్‌ మళ్లీ ఆ రేంజ్ అవతారంలో కనిపించబోతున్నాడు. దీంతో, గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదలకు ముందే బిజినెస్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది.

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు ఇంకా ప్రారంభం కాలేదు. కానీ, ఏప్రిల్ 10న సినిమా విడుదల ఖరారైపోయింది. మైత్రి మూవీ మేకర్స్ వచ్చే నెల నుండి ప్రమోషన్ స్పీడ్ పెంచబోతున్నారట. మ్యూజిక్ పరంగా దేవిశ్రీ ప్రసాద్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను జివి ప్రకాష్ అందించబోతుండటం సినిమాకు మరింత ఆకర్షణను తెచ్చే అంశంగా మారింది.

ఇప్పటి వరకు కథకు సంబంధించిన ఎలాంటి అఫీషియల్ అప్‌డేట్ బయటకు రాలేదు. కానీ, అజిత్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆయన ఒకటే సినిమాలో మంచి వాడిగా, చెడ్డ వాడిగా ద్విపాత్రాభినయం చేయడం కొంతకాలంగా జరగలేదు. దీంతో, ఇది ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కోలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ చిత్రం కనీసం 100 కోట్ల ఓపెనింగ్ సాధించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

ఈ సారి తమిళ మార్కెట్ మాత్రమే కాకుండా, తెలుగులో కూడా అజిత్ బిజినెస్ పెంచేలా మైత్రి మూవీ మేకర్స్ భారీ ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అజిత్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వస్తున్న అప్‌డేట్స్ చూస్తుంటే, గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కెరీర్‌లో మరో మాస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశముంది. మరి మైత్రి వారు ఈ క్రేజ్ ను ఏ స్థాయిలో క్యాష్ చేసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News