ఆ రెండు సినిమాలకు వర్క్ చేసి ఉంటే బావుండేది
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దగ్గర అసోసియేట్‌గా పని చేసిన నాగ్ అశ్విన్, ఎవడే సుబ్రమణ్యం సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.;

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దగ్గర అసోసియేట్‌గా పని చేసిన నాగ్ అశ్విన్, ఎవడే సుబ్రమణ్యం సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని అలనాటి నటి సావిత్రి బయోపిక్ ను మహానటి పేరుతో తీసి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. మహానటి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కల్కి 2898ఏడీ పేరుతో సినిమా తీసి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకోవడంతో పాటూ ఆ సినిమాతో అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశాడు.
రీసెంట్ గా ఓ ఈవెంట్ లో కాలేజ్ స్టూడెంట్స్ తో మాట్లాడిన నాగి, కల్కి సినిమా, తన ఆలోచనా విధానం గురించి మాట్లాడాడు. ఈ ఇంటరాక్షన్ లో అతను సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖలేజా సినిమా గురించి మాట్లాడాడు. ఖలేజా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మీకు ఏదైనా సినిమా డైరెక్ట్ చేయాలని ఉందా అని స్టూడెంట్స్ అతన్ని అడిగినప్పుడు, నాగి కొంచెం ఆలోచించి, తాను ఖలేజా, డియర్ కామ్రేడ్ సినిమాలకు ఎడిటర్ అయుంటే బాగుండేదని చెప్పాడు. గతంలో కూడా నాగ్ అశ్విన్ తనకు ఖలేజా సినిమా అంటే ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే నాగి తాను చెప్పిన రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచినవే.
ఇదే ఈవెంట్ లో కల్కి సినిమా కోసం తాను చేసిన కృషి, పడిన కష్టం గురించి కూడా నాగి వివరించాడు. కల్కిలోని ప్రతీ సీన్ వెనుక కొన్ని నెలల, సంవత్సరాల కష్టం, ప్లానింగ్ ఉందని, ఎన్నో జాగ్రత్తలు తీసుకుని కథను రాసుకోవడం వల్లే సినిమా అంత బాగా వచ్చిందని తెలిపాడు. దాంతో పాటూ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా నాగి వెల్లడించాడు. కొంతమంది డైరెక్టర్ల ఆలోచనలతో వేరే వాళ్లు సినిమాలు చేస్తున్నారని అప్పుడప్పుడు వార్తలొస్తుంటాయని, ఈ అనుభవం అందరికీ ఎదురవుతుందని, తనకు కూడా అలాంటి ఎక్స్‌పీరియెన్స్ జరిగిందని నాగి చెప్పాడు. 2008లో తాను జ్ఞాపకాల గురించి రాసుకుంటూ ఉండగా తాను రాసిన కథ ఇన్‌సెప్షన్ లాగే ఉందని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం కల్కి2 స్క్రిప్ట్ వర్క్స్ లో బిజీగా ఉన్న నాగి, ఈ ఏడాది ఆఖరి నుంచి కల్కి2ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు.