చిరంజీవితో సినిమా నా కల: నాగ్ అశ్విన్
ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి చిన్న సినిమాతో టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నాగ్ అశ్విన్ మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో చాటాడు.
ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి చిన్న సినిమాతో టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నాగ్ అశ్విన్ మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో చాటాడు. ఆ సినిమా కంటెంట్ పరంగా అందరినీ మెప్పించింది. నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమాతోనే నాగ్ అశ్విన్ తనదైన మార్క్ వేసుకున్నాడు.
ఆ తర్వాత మహానటి సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు. కానీ ఆ సినిమా తెలుగుతో పాటూ మరో రెండు మూడు భాషలకే పరిమితమైంది. గతేడాది వచ్చిన కల్కి సినిమాతో తన స్థాయేంటో ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలా చేశాడు నాగ్ అశ్విన్. కల్కి సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో రిలీజై మంచి సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే.
నాగ్ అశ్విన్ ముందు కల్కి సినిమాను అనౌన్స్ చేసినప్పుడు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను ఎంతవరకు హ్యాండిల్ చేయగలడని అందరూ సందేహించారు. కానీ వాటన్నింటికీ కల్కి సినిమాతో ఆన్సర్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. కల్కి సినిమా ఏకంగా రూ. 1100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి2 స్క్రిప్ట్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు.
అలాంటి నాగ్ అశ్విన్ అడగాలే కానీ ఎంతటి స్టార్ హీరోనైనా సినిమా చేయడానికి రెడీ అవుతారు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ఓ హీరోను డైరెక్ట్ చేయడమనేది తన కలగా చెప్తున్నాడు. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనేది తనకు కల అని ఓ కార్యక్రమంలో నాగ్ అశ్విన్ వెల్లడించాడు.
రీసెంట్ గా ఓ సినీ ఈవెంట్ కు గెస్టుగా చిరంజీవి హాజరవగా, అదే ఈవెంట్ కు నాగ్ అశ్విన్ కూడా వచ్చాడు. ఆ వేడుకలో చిరంజీవిని ఉద్దేశిస్తూ నాగ్ అశ్విన్ మాట్లాడాడు. చిరంజీవి గారు తన ఫేవరెట్ హీరో అని ఆయన్ని చూసే సినిమాల్లోకి వచ్చానని, అలాంటి ఆయనతో కలిసి ఇవాళ స్టేజ్ మీద నిల్చోవడం చాలా ఆనందంగా ఉందని, చిరంజీవి గారితో సినిమా చేయాలని ప్రతీ డైరెక్టర్‌కీ ఉన్నట్టే తనకు కూడా ఆయనతో సినిమా చేయడం కల అని, ఆ కల ఎప్పుడు నెరవేరుతుందా అని ఎంతగానో వెయిట్ చేస్తున్నట్టు నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. చిరంజీవి సినిమాల్లో తనకు చంటబ్బాయ, ఆపద్భాందవుడు సినిమాలంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా నాగి తెలిపాడు.