సంక్రాంతి క్లాష్.. 'తండేల్'కే ప్లస్ అవుతుందా?

ఇదే నిజమైతే మెగా Vs నందమూరి Vs అక్కినేని హీరోల మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం ఉంటుంది.

Update: 2024-10-23 10:03 GMT

సంక్రాంతి పండుగ టాలీవుడ్ లో ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న మీడియం హీరోల వరకూ.. అందరూ ఛాన్స్ దొరికితే ఈ సీజన్ లో రావాలనే చూస్తారు. రిలీజ్ స్లాట్ కోసం ట్రై చేస్తుంటారు. ప్రతీ ఏడాది మాదిరిగానే 2025 ఫెస్టివల్ కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే ఈసారి పొంగల్ సినిమాలపై క్లారిటీ రావడం లేదు. ఏయే చిత్రాల మధ్య ఫైనల్ గా బాక్సాఫీస్ ఫైట్ ఉంటుందనేది తెలియడం లేదు.

ఇప్పటికైతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. నటసింహం నందమూరి బాలకృష్ణ 'NBK 109' సినిమాలు సంక్రాంతికి విడుదల అవుతాయనే స్పష్టత వచ్చింది. విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య 'తండేల్' చిత్రాలు కూడా ఫెస్టివల్ రేసులో దిగాలని చూస్తున్నాయి. పొంగల్ సీజన్ లో నాలుగు సినిమాలకు ప్లేస్ ఉంటుంది. కాకపోతే ఒకే బ్యానర్ నుంచి రెండు చిత్రాలు వస్తాయా?, సంప్రదాయ నిర్మాణ సంస్థలు టఫ్ ఫైట్ లో పందేలు వేస్తారా? అనేదే ఆసక్తికరంగా మారింది.

రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఇటీవల కాలంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వస్తోన్న పెద్ద సినిమా.. మైలురాయి 50వ చిత్రం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుదల చెయ్యాలని, 'విశ్వంభర'ను కూడా వాయిదా వేయించారు. ఇప్పటికైతే చరణ్ సినిమాపై పెద్దగా బజ్ లేదు. కానీ దీపావళికి వచ్చే టీజర్‌తో అంచనాలు క్రియేట్ అవుతాయని భావిస్తున్నారు.

మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బాలయ్య, బాబీల కాంబోలో 'NBK 109' చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఎస్. నాగవంశీ. టైటిల్ అనౌన్స్ చేయకుండానే పెద్ద పండక్కి రాబోతున్నట్లు తెలిపారు. దీనికి దిల్ రాజు మేజర్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. ఎక్కువ శాతం థియేటర్లు గేమ్ చేంజర్, బాలయ్య సినిమాలకు కేటాయించాల్సి ఉంటుంది. వీటికి తోడుగా 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా వస్తే థియేటర్ల సమస్య రావడమే కాదు, అన్ని సినిమాల ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతుంది. అందుకే వెంకీ మూవీ వెనక్కి తగ్గే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఇక అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చైతన్య, చందూ మొండేటి కాంబినేషన్ లో 'తండేల్' సినిమా తెరకెక్కుతోంది. దాదాపు రూ. 80 కోట్ల భారీ బడ్జెట్ తో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా చుట్టూ మంచి బజ్ వుంది. దీన్ని వచ్చే సంక్రాంతికి తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మెగా Vs నందమూరి Vs అక్కినేని హీరోల మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం ఉంటుంది.

ఒకవేళ 'తండేల్' రాకపోతే మాత్రం పోటీ అంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ తో సీనియర్ హీరో బాలకృష్ణ పోటీ బాక్సాఫీసు దగ్గర హోరాహోరీగా సాగుతుందని అనుకోలేం. చరణ్, చైతన్య లాంటి యంగ్ జనరేషన్ స్టార్స్ మధ్య ఫైట్ జరిగితే ఈ సంక్రాంతి పోరు కాస్త ఎక్సైటింగ్ గా ఉంటుంది. కాకపోతే రామ్ చరణ్ సినిమాకి పోటీగా అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రాన్ని రిలీజ్ చేస్తారా? అనే ప్రశ్నలు కూడా వస్తాయి.

'తండేల్' సినిమా కోసం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మూడు డేట్లు పరిశీలిస్తున్నారు. ఎక్కువ శాతం జనవరిలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఆల్రెడీ ఓటీటీ స్లాట్ బుక్ అవడంతో, జనవరిలోనే విడుదల చెయ్యాలని ఒత్తిడి చేస్తున్నారట. ఒకటి రెండు రోజుల్లో రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

'తండేల్' చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్0' తో క్లాష్ కు వెళ్తే, నాగచైతన్య సినిమాకే ప్లస్ అవుతుందని అంటున్నారు. పోయిన పండక్కి 'గుంటూరు కారం', 'హను-మాన్' సినిమాల మధ్య జరిగిందే, మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అధిక టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు అనుమతి ఉంది కాబట్టి.. మంచి ఓపెనింగ్స్ కు ఎలాగూ డోకా ఉండదు. అదే పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లకు తిరుగుండదు. అందుకే 'తండేల్'ను ఫెస్టివల్ రేసులో నిలపాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరికొందరు మాత్రం 'గేమ్ ఛేంజర్'తో క్లాష్ కు వెళ్ళడం రిస్క్ అవుతుందేమో అనే కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News