'దేవర' వసూళ్లు నిజమేనా.. నాగవంశీ ఏమన్నారంటే..

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. రీసెంట్ గా దేవర పార్ట్-1తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-10-11 14:14 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. రీసెంట్ గా దేవర పార్ట్-1తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన మూవీ సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. రివ్యూస్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. దసరా హాలీడేస్ కావడంతో సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది. మేకర్స్ కు మంచి లాభాలు అందిస్తోంది.

అయితే దేవర తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత నాగవంశీ దక్కించుకున్న విషయం తెలిసిందే. భారీగా తెలుగు స్టేట్స్ లో సినిమాను రిలీజ్ చేసిన ఆయన.. ఇప్పుడు దేవర వసూళ్లకు సంబంధించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దసరా సందర్భంగా మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ మూవీ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు నాగవంశీ. ఆ సమయంలో దేవర మూవీ వసూళ్ల కోసం మాట్లాడారు.

ఓవరాల్ గా దేవర వసూళ్ల విషయంలో హ్యాపీగా ఉన్నారా అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. "మీరు చెప్పాలి దానికి.. ఇందాక కూడా అడిగా కదా.. నేను హ్యాపీ అని చెప్పినా మీరు ఒప్పుకోరు కదా.. మీరు హిట్ అని ఒప్పుకుంటే మేము హ్యాపీయో కాదో తెలుస్తుంది. డబ్బులు వచ్చాయన్నా ఒప్పుకోరు కదా.. నమ్మరు కదా.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇచ్చాం.. ప్రతి రోజు వసూళ్లు తప్పు అనే అన్నారు. తప్పు కలెక్షన్స్ ఎందుకిస్తాం?" అని నవ్వుతూ ప్రశ్నించారు

"నేను సినిమా కొని డిస్ట్రిబ్యూటర్లకు అమ్మా.. నా ప్రతి డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ.. ఓవరాల్ గా నేను కూడా హ్యాపీ.. కలెక్షన్స్ బయటపెట్టడం.. పోస్టర్లు వేయడం ఫ్యాన్స్ కోసమే చేస్తున్నాం.. ఫ్యాన్స్ హ్యాపీ అయితే మేం హ్యాపీ.. ఎవరికో ప్రూవ్ చేయడానికి వేయడం లేదు.. హాలీవుడ్ లో ఆ కల్చర్ ఉంది.. బాలీవుడ్ లో ఉంది.. మనకూ ఉంది.. ఇన్కమ్ టాక్స్ వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. గ్రాస్, షేర్ నంబర్స్ వేర్వేరు అని వాళ్లకు తెలుసు" అని నాగవంశీ తెలిపారు.

అయితే తెలుగు రాష్ట్రాల నుంచి దేవరకు హైయెస్ట్ గ్రాస్ వచ్చిందని నాగవంశీ వెల్లడించారు. ఒరిజినల్‌ నంబర్స్‌ మాత్రమే రివీల్ చేశామని చెప్పారు. దాంతోపాటు దేవర సెలబ్రేషన్స్ పై స్పందించారు. విదేశాల్లో ప్లాన్ చేస్తున్నట్లు కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు వస్తున్నాయని అన్నారు. కానీ వాటిలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం లక్కీ భాస్కర్ ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడిన వీడియోస్.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Tags:    

Similar News