అనిల్ రావిపూడితో క్లాష్ పై బాలయ్య నిర్మాత ఫన్నీ పోస్ట్!

ఇప్పుడు 2025 సంక్రాంతికి ఇద్దరూ మరోసారి క్లాష్ లో వస్తున్నారు. దీన్ని ఉద్దేశించే నిర్మాత నాగవంశీ ఫన్నీగా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

Update: 2024-11-21 10:54 GMT

2025 సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దిగే సినిమాలపై దాదాపుగా ఇప్పుడిప్పుడే క్లారిటీ వచ్చేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ చేంజర్', నటసింహం నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్', విక్టరీ వెంకటేష్ చేస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు పొంగల్ సీజన్ లో విడుదల కాబోతున్నాయి. ఇప్పటికైతే మేకర్స్ ఈ మూడు చిత్రాల రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేసేశారు. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ తాజాగా పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

'గేమ్ చేంజర్' & 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'డాకు మహారాజ్' చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈ సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే పండక్కి బాక్సాఫీస్ వద్ద దిల్ రాజు సినిమాలతో దిల్ రాజు సినిమాలే పోటీ పడబోతున్నాయన్నమాట. అందుకే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి తన బెస్ట్ విషెస్ ను అందజేశారు నాగవంశీ.

''వెంకటేష్ గారు, దిల్‌ రాజు గారు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాను. అనిల్ రావిపూడి గారూ మీతో గతంలో రెండు సార్లు పోటీ పడడం మెమరబుల్ గా నిలిచిపోయింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్టు కొట్టి దీన్ని కూడా మెమరబుల్ గా ఉండనివ్వండి!'' అని నాగవంశీ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరూ', నాగవంశీ నిర్మించిన 'అల వైకుంఠపురములో' సినిమాలు 2020 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. రెండూ మంచి విజయాలు సాధించాయి. ఆ తర్వాత అనిల్ డైరెక్ట్ చేసిన 'భగవంత్ కేసరి'.. నాగవంశీ రిలీజ్ చేసిన చేసిన తమిళ్ డబ్బింగ్ మూవీ 'లియో' 2023 దసరా పండక్కి పోటీ పడ్డాయి. ఇప్పుడు 2025 సంక్రాంతికి ఇద్దరూ మరోసారి క్లాష్ లో వస్తున్నారు. దీన్ని ఉద్దేశించే నిర్మాత నాగవంశీ ఫన్నీగా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

సంక్రాంతికి వచ్చే మూడు సినిమాలతో నిర్మాత దిల్ రాజు సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి, దీన్ని ఆహ్లాదకరమైన పోటీగానే భావించవచ్చు. కాకపోతే థియేటర్లు కేటాయింపులో, ప్రమోషనల్ కంటెంట్ ను వదిలే విషయంలో ముగ్గురు హీరోల అభిమానులను ఎలా సంతృప్తి పరుస్తారనేది చూడాలి. 'గేమ్ చేంజర్' భారీ బడ్జెట్ తో రూపొందే పాన్ ఇండియా మూవీ కావడంతో, ఎక్కువ స్క్రీన్స్ లభించే అవకాశం ఉంది. ఆ తర్వాత 'డాకు మహారాజ్' చిత్రానికి, 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి థియేటర్లు అలాట్ చేస్తారు. వీటితో పాటుగా 'మజాకా' లాంటి మీడియం రేంజ్ సినిమా లేదా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' లాంటి తమిళ డబ్బింగ్ మూవీ రేసులోకి వస్తే మాత్రం, వాటికి కూడా థియేటర్లు సర్దుబాటు చెయ్యాల్సి ఉంటుంది. మరి బాక్సాఫీస్ క్లాష్ ను నివారించడానికి దిల్ రాజు సజావుగా ఎలా రిలీజులు ప్లాన్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News