రౌడీ స్టార్... మనకు మరో పార్ట్ అవసరమా?
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్నాడు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కానీ ఈ ఏడాది ఆయన ఫ్యామిలీ స్టార్ సినిమాతో నిరాశ పరిచారు. గీత గోవిందం స్థాయిలో ఫ్యామిలీ స్టార్ ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఆ సినిమాను దిల్ రాజు నిర్మించిన విషయం తెల్సిందే. ఫ్యామిలీ స్టార్ ఫెయిల్యూర్ నేపథ్యంలో రౌడీ స్టార్ తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్త పడుతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్నాడు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తూ ఉండగా కీలక పాత్రలో రష్మిక మందన్న కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని విజయ్ దేవరకొండ లుక్ విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదటి నుంచి సినిమాలో రౌడీ స్టార్ మాస్‌లుక్‌లో కనిపించబోతున్నారు అంటున్నారు.
తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర అప్‌డేట్‌ను నిర్మాత నాగ వంశీ ఇచ్చారు. ఆయన బ్యానర్‌లో రూపొందిన డాకు మహారాజ్ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మా బ్యానర్‌లో రూపొందుతున్న విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబో మూవీని రెండు పార్ట్‌లుగా తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్‌కు అనుగుణంగానే తమ సినిమాని రెండు పార్ట్‌లుగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఆయన పేర్కొన్నాడు.
ముందుగా అనుకున్న కథను రెండు పార్ట్‌లుగా తీస్తారా లేదంటే ముందుగా అనుకున్న కథను పూర్తి చేసి మళ్లీ రెండో పార్ట్ కోసం కథను రూపొందిస్తారా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఈమధ్య కాలంలో చాలా సినిమాలకు పార్ట్ 2 లు వస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయి. అన్ని సినిమాలు బాహుబలి 2, కేజీఎఫ్ 2, పుష్ప 2 ల మాదిరిగా భారీ విజయాలను సొంతం చేసుకోవడం కష్టం. ఇటీవల వచ్చిన విడుదల పార్ట్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. కనుక అన్ని సినిమాలకు పార్ట్ 2 లు అవసరం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే కొందరు రౌడీ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ సినిమాకు పార్ట్ 2 అవసరమా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు