'కల్కి' దర్శకుడు మంచి మనసుతో...!

ప్రభాస్ నటించిన ఈ విభిన్నమైన ఫిక్షన్‌ సినిమా దాదాపుగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి రికార్డ్‌ సృష్టించిన విషయం తెల్సిందే.

Update: 2024-08-10 13:08 GMT

పదేళ్ల క్రితం ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఈ పదేళ్ల కాలంలో నాగ్‌ అశ్విన్ చేసిన సినిమాలు మూడే మూడు. ఆ మూడు కూడా మంచి విజయాలను సొంతం చేసుకోవడంతో ఆయన పాన్‌ ఇండియా స్టార్‌ దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మొదటి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోగా, రెండో సినిమా మహానటి పాన్‌ ఇండియా స్థాయిలో అన్ని భాషల ప్రేక్షకులను అలరించి ఏకంగా జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న విషయం తెల్సిందే.

ఇక మూడో సినిమా కల్కి ఇటీవల విడుదల అయ్యింది. ప్రభాస్ నటించిన ఈ విభిన్నమైన ఫిక్షన్‌ సినిమా దాదాపుగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి రికార్డ్‌ సృష్టించిన విషయం తెల్సిందే. కల్కి సినిమా సాధించిన విజయం గురించి ఇంకా కూడా చర్చ జరుగుతూనే ఉంది. ఇంకా చాలా చోట్ల థియేటర్ లో సందడి చేస్తున్న కల్కి త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతోంది. మరో వైపు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కల్కి 2 పనుల్లో పడ్డాడు. ఇటీవల నాగ్ అశ్విన్ తన స్వగ్రామం అయిన ఐతోలు లో పర్యటించారు. అక్కడ సొంత నిధులతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్కూల్‌ అదనపు భవనాలను ప్రారంభించారు.

నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఐతోలు గ్రామానికి చెందిన నాగ్‌ అశ్విన్‌ కొన్నాళ్ల క్రితం తన స్వగ్రామంలో ఉన్న స్కూల్‌ పరిస్థితిన చూసి కొత్త భవనాలను నిర్మించాలని భావించాడు. అందుకోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారు. ఇటీవలే ఐతోలు లో నాగ్‌ అశ్విన్‌ పర్యటించారు. నాగ్‌ అశ్విన్‌ తో పాటు గ్రామంలో స్కూల్‌ భవనాల ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే రాజేష్ మరియు జిల్లా కలెక్టర్ సంతోష్ లు పాల్గొన్నారు. ఐతోలు గ్రామంలో ఇంకా పలు అభివృద్ది కార్యక్రమాల కోసం నాగ్‌ అశ్విన్‌ గతంలో కూడా ఖర్చు చేశారు అంటూ గ్రామస్తులు చెప్పుకొచ్చారు.

నాగ్‌ అశ్విన్‌ సినిమాల విషయానికి వస్తే మహానటి సినిమాలో మహానటి సావిత్రి జీవిత కథను చూపించాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కు ఎంతటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో సినిమాకు రాజమౌళి మాదిరిగా ఏళ్లకు ఏళ్లు తీసుకోవడం వల్లే ఈ పదేళ్ల కాలంలో కేవలం మూడు సినిమాలను మాత్రమే పూర్తి చేశాడు. భవిష్యత్తులో అయినా ఏడాదికి ఒకటి చొప్పున నాగ్‌ అశ్విన్‌ సినిమాలు చేయాలని, మొదటగా కల్కి 2 సినిమా వచ్చే ఏడాదిలో విడుదల అయ్యేలా ప్లాన్‌ చేయాలని ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News