రూ.1500 తీసుకుంటే తప్పేంటి?.. టికెట్ రేట్లపై నాగవంశీ కామెంట్స్
1500 రూపాయలు ఖర్చు పెడితే నలుగురు సినిమా చూసి ఎంజాయ్ చేయచ్చని చెబుతున్నారు.
సినిమా టికెట్ రేట్ల మీద ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చలు జరుగుతుంటాయి. అధిక ధరల కారణంగా, థియేటర్ల వద్ద తినుబండారాల రేట్లు పెంచడం వల్ల సామాన్యుడికి సినీ వినోదం దూరం అవుతోందనే వాదన చాలాకాలంగా వినిపిస్తోంది. మరోపక్క ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది కాబట్టి, ప్రొడ్యూసర్ బ్రతకాలంటే దానికి తగ్గట్టుగా రేట్లు ఉండాలనే మరో వాదన కూడా ఉంది. అందుకే టాలీవుడ్ లో ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే, వారం పది రోజుల పాటు రేట్లు పెంచుకునేలా ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుంటున్నారు. కానీ ఈ అధిక రేట్ల కారణంగానే ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్స్ కి రావడం తగ్గిపోతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పుడు టికెట్ రేట్లు ఎక్కువేమీ లేవని అంటున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 1500 రూపాయలు ఖర్చు పెడితే నలుగురు సినిమా చూసి ఎంజాయ్ చేయచ్చని చెబుతున్నారు.
సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో టికెట్ రేట్ల మీద మాట్లాడారు. సినిమా టికెట్ రేట్లు ఇప్పటికి కూడా తక్కువగానే ఉన్నాయని అన్నారు. ''ఒక ఫ్యామిలీలో నలుగురు సినిమాకు వెళ్తే, సింగిల్ స్క్రీన్ లో ఒక టికెట్ కి రూ.250 లెక్కన రూ. 1000 అవుతుంది. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కి రూ. 500 అనుకున్నా 1500 ఖర్చు అవుతుంది. 1500 రూపాయలకు 3 గంటల ఎంటర్టైన్మెంట్ మీకు ఎక్కడ దొరుకుతుంది?. ఆంధ్రా, తెలంగాణ, యూఎస్ లలో అదే పదిహేను వందలకు అన్ని గంటలు ఎంటర్టైన్ చేసే ప్లేస్ ఏముందో చెప్పండి?. షాపింగ్ మాల్స్ కి వెళ్తే ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. మిమ్మల్ని మూడు గంటలు కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేసి 1500 తీసుకుంటే తప్పేంటి?. ఇవాళ్టికీ చీప్ గా దొరికే ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రమే'' అని నాగవంశీ చెప్పారు.
పెద్ద సినిమాలు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అధిక టికెట్ రేట్లు కావాలని నాగవంశీ అన్నారు. ''మ్యానిఫ్యాక్చర్ కాస్ట్ పెరిగిందనే రేట్లు అడుగుతున్నాం. సినిమా మీద అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నాం కాబట్టే ప్రభుత్వం నుంచి రేట్లు తెచ్చుకుంటున్నాం అంతే. దాని వల్ల జనాలకేమీ అన్యాయం చేయడం లేదు. నేను టికెట్ రేట్ 1000 పెడితే తప్పు. కానీ నేను 'దేవర' సినిమాకు పెట్టింది రూ.250. ఫ్యామిలీకి వెయ్యి రూపాయలు మాత్రమే కదా అవుతుంది. నెలకు మహా అయితే రెండు సినిమాలు చూస్తారు.. ఎవరూ 20 సినిమాలు చూడటం లేదు కదా'' అని నాగవంశీ అన్నారు. టికెట్ రేట్లు చిన్న సినిమాని చంపేస్తున్నాయనే వ్యాఖ్యలను నిర్మాత ఖండించారు.
''కామన్ ఆడియన్స్ తప్పకుండా పెద్ద సినిమాని థియేటర్ లో చూడాలి అనుకుంటారు, మిగతా సినిమాలు బాగున్నాయి అంటేనే వస్తున్నారు. 'కల్కి' 'దేవర' 'గుంటూరు కారం' లాంటి పెద్ద సినిమాలు ఎలా ఉన్నాయో తెలియకపోయినా వస్తున్నారు.. చిన్న సినిమా బాగుందంటే, దీని మీద మనీ స్పెండ్ చేసినా పర్వాలేదు అని డిసైడై వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. 'టిల్లు స్క్వేర్' 'బేబీ' 'మ్యాడ్' 'కమిటీ కుర్రోళ్ళు' 'ఆయ్' 'మత్తు వదలరా 2' లాంటి చాలా చిన్న సినిమాలు బాగా ఆడాయి. కంటెంట్ బాగుంది అని టాక్ వస్తే సినిమా చూడాలని నిర్ణయించుకొని వస్తున్నారు'' అని నాగవంశీ విశ్లేషించారు.
నాగవంశీ కామెంట్స్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాలు థియేటర్లకు రావడం లేదని, అందుకే ఆడిన వారం పది రోజుల్లో కలెక్షన్స్ రాబట్టుకోవాలంటే అధిక టికెట్ రేట్లు ఉండాలని ఓ వర్గం జనాలు అంటున్నారు. మరికొందరు మాత్రం నిర్మాతను ట్రోల్ చేస్తున్నారు. మూడు వేలు పెట్టి నెలకు రెండు సినిమాలు థియేటర్ లో చూడటం కంటే, అదే డబ్బుతో ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే లెక్కలేనన్ని సినిమాలు చూడొచ్చని అంటున్నారు. సింగిల్ స్క్రీన్ కే ఇంత ఉంటే, మల్టీఫ్లెక్స్ సంగతేంటి అని ప్రశ్నిస్తున్నారు.
1500 రూపాయలు పెడితే మధ్యతరగతి కుటుంబానికి పది రోజులకు సరిపడా సరుకులు వస్తాయని అంటున్నారు. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా టికెట్ రేట్లు పెట్టుకోవచ్చు కదా? నాగవంశీ ఈ విధంగా ఎందుకు ఆలోచించడం లేదు? అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా సామాన్య ప్రజానీకానికి భారం కాకుండా, నిర్మాతలకు నష్టం రాకుండా ఉండేలా టిక్కెట్ ధరలు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.