ఆ రోజు తప్పు నాదే.. అలా చేసి ఉండకూడదు

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నానా పటేకర్‌ గత ఏడాది ఒక అభిమానిపై చేయి చేసుకోవడం వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే.

Update: 2024-12-05 13:30 GMT

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నానా పటేకర్‌ గత ఏడాది ఒక అభిమానిపై చేయి చేసుకోవడం వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. వన్‌వాస్ అనే సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన సంఘటనపై పలువురు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం మంది అభిమానిపై నానా పటేకర్‌ చేయి చేసుకోవడంను తప్పు పడుతూ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీకి చెందిన కొందరు మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. సమయం సందర్భం లేకుండా వచ్చి ఫోటోలు తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. అలా నానా పటేకర్‌ను ఇబ్బంది పెట్టడం వల్లే ఆ సమయంలో ఉన్న పరిస్థితుల కారణంగా చేయి చేసుకోవాల్సి వచ్చిందేమో అని కొందరు మాట్లాడుకున్నారు.

ఆ సంఘటన జరిగి ఏడాది దాటిన తర్వాత నటుడు నానా పటేకర్‌ స్పందించారు. ఒక చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ ఆ రోజు జరిగిన మొత్తం సంఘటనలో తప్పు నాదే, అలా అతడిపై చేయి చేసుకోకుండా ఉండాల్సింది అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... వన్వాస్‌ షూటింగ్‌లో అంతా బిజీగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి నా వద్దకు దూసుకు వచ్చాడు. నటీనటులు అంతా షూట్‌లో బిజీగా ఉండగా అతడు రావడంతో నాకు కోపం వచ్చింది. నా ఫీలింగ్‌ని పట్టించుకోకుండా ఫోటో తీసుకుంటూ ఉంటే కోపంతో కొట్టాను. అది కాస్త చాలా దుమారం రేపింది అన్నారు.

ఆ రోజు నేను అలా చేయడం తప్పే అని ఆ తర్వాత అర్థం అయ్యింది. అతడు నాపై ఉన్న ప్రేమతో సెల్ఫీ తీసుకునేందుకు వచ్చాడు. మేము షాట్‌ లో ఉన్న సంగతి అతడు గుర్తించినట్లుగా లేడు. అతడు ఆ విషయాన్ని గుర్తించి ఉంటే కచ్చితంగా వచ్చి ఉండేవాడు కాదేమో. ఒక వ్యక్తిపై ప్రేమను వ్యక్త పరచడంకు సమయం, సందర్భం అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. షాట్‌ పూర్తి అయిన తర్వాత పక్కన ఉన్న సమయంలో అతడు నా వద్దకు సెల్ఫీ కోసం వచ్చి ఉంటే బాగుండేది. అలా అతడు చేసి ఉంటే ఎలాంటి ఇబ్బంది వచ్చేది కాదు అని నానా పటేకర్‌ పేర్కొన్నారు.

వారణాసి వీధుల్లో జరుగుతున్న షూటింగ్‌ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. నానా పటేకర్‌ చాలా బలంగా అభిమాని తలపై కొట్టడం వీడియోలో రికార్డ్‌ అయ్యింది. ఆ వీడియోలో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ కావడంతో ఇప్పుడు ఆయన స్పందించారు. డిసెంబర్‌ 20వ తారీకున వన్ వాస్ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆ రోజు జరిగిన సంఘటనలో తప్పు నాదే అంటూ అతడికి క్షమాపణలు సైతం చెప్పడం ద్వారా నానా పటేకర్‌ మంచి మనసు గురించి అంతా ప్రశంసిస్తున్నారు, అదే సమయంలో వన్‌ వాస్‌ సినిమాకు పబ్లిసిటీ దక్కింది.

Tags:    

Similar News