బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్‌కు ఆ హీరోలు వస్తారా?

అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఆయన్ను సెప్టెంబర్ 1వ తేదీన ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకున్నారు.

Update: 2024-07-31 17:26 GMT

నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ నెలాఖరుకి సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన తెరంగేట్రం చేసిన ‘తాతమ్మ కల’ సినిమా 1974 ఆగస్టు 30న విడుదలైంది. టాలీవుడ్ లో యాభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని కొనసాగుతూ, ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. సినీ రంగంలోనే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్ ఛైర్మన్‌గా రాజకీయ సేవా రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు బాలయ్య. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఆయన్ను సెప్టెంబర్ 1వ తేదీన ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకున్నారు.


బాలకృష్ణ 50 వసంతాల గోల్డెన్ జూబ్లీ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి భారతీయ సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. నందమూరి అభిమానులు భారీ ఎత్తున తరలి వస్తారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఓ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర మినిస్టర్లు, ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అయితే టాలీవుడ్ నుంచి ఎవరెవరు ముఖ్య అతిథులుగా వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.


బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకకు స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరో హీరోయిన్ల వరకూ, ఇతర నటీనటులు, దర్శకులు, ప్రముఖ సాంకేతిక నిపుణులు అందరికీ ఆహ్వానం వెళ్లే అవకాశం ఉంది. చిరంజీవి, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్, మంచు మోహన్ బాబు లాంటి బాలకృష్ణ సమకాలీన కథానాయకులు ఈ కార్యక్రమానికి వస్తారా లేదా అనే చర్చలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే వీరంతా ఒకే వేదిక మీద కనిపించి చాలా సంవత్సరాలు అయింది. గతేడాది జరిగిన ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకకు కూడా వీరు హాజరవ్వలేదు. మెగా అక్కినేని ఫ్యామిలీల తరపున రామ్ చరణ్, నాగచైతన్య, సుమంత్ లు మాత్రమే వచ్చారు.

అలానే బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతాడా లేదా? అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. బాబాయ్ - అబ్బాయ్ కలిసి ఒకే వేదికను పంచుకొని చాలా ఏళ్ళు గడిచిపోయింది. ఇటీవల కాలంలో వారి మధ్య దూరం పెరిగిందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా ఆహ్వానం అందినా ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలకు తారక్ రాలేదు. ఇప్పుడు బాలయ్య 50 వసంతాల సినీ సన్మాన కార్యక్రమానికి తారక్ తో పాటుగా చిరు, నాగ్, వెంకీ, మోహన్ బాబు లాంటి సీనియర్ హీరోలు కూడా వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆహ్వాన పత్రికలో బాలకృష్ణ సినీ రంగానికి చేసిన సేవలను ప్రస్తావించారు. 1974 నుంచి 2024 వరకూ అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారని, 50ఏళ్ల సినీ ప్రయాణంలో 109 సినిమాల్లో నటించారని, అత్యధికంగా 29 మంది హీరోయిన్స్‌ తో కలిసి నటించారని పేర్కొన్నారు. సోషల్, మైథలాజికల్‌, హిస్టారికల్‌, జానపథ, బయోపిక్, సైన్స్‌ ఫిక్షన్‌.. ఇలా ఆరు రకాల జానర్స్‌లో నటించిన రికార్డు బాలయ్యకు ఉంది. ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన నటుడిగా నిలిచారు.

Tags:    

Similar News