నాని.. సుజిత్ కంటే ముందు మరొకటి
ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు కచ్చితంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
నేచురల్ స్టార్ నాని ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నాడు. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు కచ్చితంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే రెగ్యులర్ కి భిన్నంగా కొత్త కథలని, కొత్త దర్శకులని నాని పరిచయం చేస్తూ ఉండటం విశేషం. నానికి కథల విషయంలో చాలా గ్రిప్ ఉంటుంది. అందుకే ఆయనకి ఎక్కువ సక్సెస్ లు లభిస్తాయి. ప్రస్తుతం నాని శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’ మూవీ చేస్తున్నాడు.
ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదటి సారి నాని కెరియర్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రని ఈ చిత్రంలో చేస్తున్నాడు. ఈ సినిమా 2025 మే 1న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. దీని తర్వాత ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో సినిమాని నాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు. ఈ చిత్రాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేసి థియేటర్స్ లోకి తీసుకొని రావాలని అనుకుంటున్నారు. 2026 ప్రథమార్ధంలో మూవీ రిలీజ్ కావచ్చు.
ఈ చిత్రం తర్వాత సుజిత్ దర్శకత్వంలో నాని సినిమా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. పవన్ తో చేస్తోన్న ‘ఓజీ’ రిలీజ్ తర్వాత సుజిత్ నాని సినిమా పైన ఫోకస్ చేయనున్నారు. అయితే నాని సుజిత్ సినిమా కంటే ముందుగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారంట. కేవలం 3 నెలల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేలా ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని టాక్ వినిపిస్తోంది. న్యూ ఏజ్ స్టైలిష్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా ఉంటుందని టాక్ నడుస్తోంది. నాని ‘నిన్నుకోరి’ సినిమాతో శివ నిర్వాణని దర్శకుడిగా పరిచయం చేశాడు. తరువాత ‘టక్ జగదీశ్’ అనే మరో మూవీ కూడా ఈ దర్శకుడితో చేశారు. శివ నిర్వాణ చివరిగా విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ మూవీ చేశారు. దీని తర్వాత కొత్త సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇప్పుడు నానితో మూవీ కన్ఫర్మ్ అయ్యిందనే టాక్ తెరపైకి వచ్చింది. శివ నిర్వాణ అంటే క్లాస్ టచ్, లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాతో ఉన్న సినిమాలే గుర్తుకొస్తాయి. ఇప్పుడు నానితో కూడా తనకి అలవాటైన జోనర్ లోనే మూవీ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడొస్తుందా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.