‘క్లిష్ట సమయంలో అండగా నిలిచారు’.. నారా రోహిత్ పోస్ట్!

ఈ క్రమంలో.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని స్వగ్రామం నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు.

Update: 2024-11-18 07:21 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు శనివారం ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కార్డియక్ అరెస్ట్ తో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని స్వగ్రామం నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు.

శనివారం రామ్మూర్తినాయుడు కన్నుమూయగా.. ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. అక్కడ నుంచి స్వగ్రామానికి చేర్చారు. అనంతరం.. తల్లితండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయుడి సమాధుల పక్కనే నారా రామ్మూర్తినాయుడి అంత్యక్రియలను ఆదివారం నిర్వహించారు.

రామ్మూర్తినాయుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు, నారావారి కుటుంబ సభ్యులు, నాయకులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కన్నీటివీడ్కోలు పలికారు. ఈ సమయంలో.. తన తండ్రి భౌతికకాయం వద్ద నారా రోహిత్, నారా గిరీష్ లు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సమయంలో వారి అన్న లోకేష్ అక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు!

ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి, తన పెదనాన్న చంద్రబాబుతో పాటు ఆత్మీయులు, సన్నిహితులు, అభిమానులను ఉద్దేశించి సినీ హీరో నారా రోహిత్ పోస్ట్ పెట్టారు. తన తండ్రి రామ్మూర్తి నాయుడి మృతితో తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిన వేళ తమకు అండగా నిలిచినవారందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు.

తన తండ్రి మరణంతో కుటుంబం అంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన వేళ స్నేహితులు, కుటుంబ సభ్యుల విలువైన మాటలు తమలో ఎంతో ధైర్యాన్ని నింపాయని.. ఈ సమయంలో తమకు అండగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు అని నారా రోహిత్ 'ఎక్స్' వేదికగా చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు.

ఇదే సమయంలో... క్లిష్ట సమయంలో తమకు ఎంతో సపోర్ట్ గా నిలిచిన పెదనాన్న (చంద్రబాబు నాయుడు), పెద్దమ్మ (భువనేశ్వరి), లోకేష్ అన్న, బ్రాహ్మణి వదినలకు ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు.

కాగా... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొదరుడు రామ్మూర్తి నాయుడికి ఇద్దరు కుమారులు అనే సంగతి తెలిసిందే. వారిలో పెద్ద కుమారుడు నారా గిరీష్ కాగా.. చిన్నాయన సినీ నటుడు నారా రోహిత్!

Tags:    

Similar News