విజయ నిర్మల బయోపిక్...రంగంలోకి నరేష్!
తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంది లెజెండరీ నటీనటుల బయోపిక్ లు తెరకెక్కాల్సి ఉంది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంది లెజెండరీ నటీనటుల బయోపిక్ లు తెరకెక్కాల్సి ఉంది. కానీ ఇంకా ఆ ప్రయత్నాలు జరగడం లేదు. ఎన్టీఆర్ తర్వాత వెండి తెరకు ఎక్కడాల్సిన ఏఎన్నార్, కృష్ణ, రామానాయుడు, దాసరి నారాయణరావు, జమున, విజయ నిర్మాల ఇలా కొంత మంది లెజెండరీ జీవితాలు వెండి తెరకెక్కితే చూడాలని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కానీ సాహసం చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు.
ఎవరికి వారే అంతటి బరువైన బాద్యతను నెత్తిన పెట్టుకోవడానికి సిద్దంగా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నరేష్ తన తల్లి విజయ నిర్మల బయోపిక్ తానే తీస్తాను అన్నట్లు వ్యాఖ్యానించారు. అది తన తల్లి కోరికగానూ ఆయన చెప్పుకొచ్చారు. `అమ్మ బయోపిక్ చేయాలన్నది నా కల. అది రాయగలిగితే నేనే రాస్తాను. అమ్మ కూడా ఆ మాట చెప్పేవారు. ఆమెను నా చిన్నప్పటి నుంచి చూసాను. చాలా విషయాలు నాకు తెలుసు.
కాబట్టి నేను రాస్తే బాగుంటుందన్నది అమ్మ భావించేవారు. అందుకే ఆ ఛాన్స్ తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే దర్శకత్వం కూడా చేసే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. `చిత్రం భళారే విచిత్రం`, `శ్రీవారికి ప్రేమ లేఖ` సినిమాలకు కొనసాగింపు చిత్రాలను తీయాలన్నది తన మరో కలగా రివీల్ చేసారు. మరి ఈ కలలను నరేష్ ఎప్పుడు సాకారం చేసుకుంటారో చూడాలి. అలాగే విజయ నిర్మాలతో పాటు మరికొంత మందికి అర్హత ఉన్నా? పద్మ పురస్కారాలు రాలేదన్నారు.
తనయుడిగా కాకుండా పరిశ్రమ వ్యక్తిగా మరోసారి ఆ పురస్కారాల కోసం ప్రయత్నం చేస్తానన్నారు. అలాగే సమాజానికి తిరిగి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఘట్టమనేని ఇందిరాదేవి పేరుతో సినిమా మ్యూజియం అండ్ లైబ్రెరీని ఏర్పాటు చేసామని, అందుకోసం ప్రత్యేకంగా ఓ భవనాన్ని కూడా నిర్మిస్తామని తెలిపారు.