గలీజ్ కిడ్నాప్ కేసులో మైత్రీ మూవీ అధినేత పేరు!

ఎన్ ఆర్ ఐ కం వ్యాపారవేత్తగా పేరున్న వేణు మాధవ్ ఇటీవల తనకు జరిగిన అన్యాయంపై గళం విప్పి.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు

Update: 2024-04-15 04:32 GMT

ఒక కంపెనీ. దాన్ని పెట్టి పెద్దది చేసిన పెద్ద మనిషిని బెదిరింపులకు గురి చేసి.. బలవంతంగా తమ సొంతం చేసుకోవటం లాంటి సీన్.. సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. రీల్ కు ఏ మాత్రం తగ్గని రీతిలో ఇలాంటి ఉదంతం ఒకటి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ మహానగరంలో గుట్టు చప్పుడు కాకుండా చోటు చేసుకున్నట్లుగా ఇటీవల వార్తలు రావటం తెలిసిందే. ఇంతకూ ఏ కేసు అంటారా?

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అండ్ టీం కలిపి జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత చెన్నుపాటి వేణుమాధవ్ ను కిడ్నాప్ చేయటం.. అతడి నుంచి యాజమాన్య మార్పిడి చేయటంతో పాటు.. షేర్లను బదలాయించినట్లుగా ఆరోపణలు రావటం తెలిసిందే. ఎన్ ఆర్ ఐ కం వ్యాపారవేత్తగా పేరున్న వేణు మాధవ్ ఇటీవల తనకు జరిగిన అన్యాయంపై గళం విప్పి.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో.. ఈ వ్యవహారం తెర మీదకు వచ్చి సంచలనంగా మారింది. గత ప్రభుత్వంలో అధికార పార్టీకి చెందిన ప్రముఖులకు దగ్గరగా వ్యవహరించిన కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఇన్ని దారుణాలకు పాల్పడ్డారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే.. ఈ ఉదంతానికి సంబంధించి మాజీ డీసీపీ రాధాకిషన్ తో పాటు.. ఇన్ స్పెక్టర్ గట్టుమల్లు.. ఎస్ఐ మల్లికార్జున్ తో సహా పలువురిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావటం తెలిసిందే. తాజాగా ఇదే కేసులో ప్రముఖ నిర్మాత కం పలు క్రేజీ చిత్రాల్ని నిర్మించిన మైత్రీమూవీస్ అధినేత నవీన్ యర్నేని కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడన్న విషయాన్ని పోలీసులు వెల్లడించారు. నవీన్ యర్నేని పేరును నిందితుల జాబితాలో చేర్చినట్లుగా జూబ్లీహిల్స్ సీఐ వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడించటంతో ఈ ఇష్యూ మరో మలుపు తిరిగినట్లుగా చెప్పాలి.

కిడ్నాప్ చేసి.. కంపెనీ యాజమాన్య హక్కుల్ని బలవంతంగా కంపెనీకి చెందిన నలుగురు డైరెక్టర్ల పేర్లపై బదలాయింపునకు పాల్పడిన ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులకు సైతం లబ్ధి చేకూరినట్లుగా పేర్కొంటున్నారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు సంస్థ ఎండీగా వ్యవహరించిన రాజశేఖర్ తలసిల.. డైరెక్టర్లుగా ఉన్న గోపాలక్రిష్ణ.. నవీన్ యర్నేని.. రవికుమార్ మందలపు.. వీరమాచినేని పూర్ణ చందర్ రావులను తాజాగా నిందితుల జాబితాలో చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసు అధికారులైన రాధా కిషన్ రావు.. గట్టుమల్లు.. మల్లికార్జున్ తో పాటు క్రిష్ణ గోపాల్.. రాజ్.. రవి.. బాలాజీ.. చంద్రశేఖర్ వేగేలతో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొనటం తెలిసిందే.


Full View


Tags:    

Similar News