గేమ్ ఛేంజర్ వల్ల బంపరాఫర్ మిస్ అయ్యా!
నవీన్ చంద్ర యాక్టింగ్ కు స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నవీన్ కు ఈ మధ్య వరుస అవకాశాలు వస్తున్నాయి.;

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ ఛాన్స్ ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఏ ఛాన్స్ ఎలాంటి కారణంతో మిస్ అవుతుందో కూడా తెలియదు. కొన్ని ఛాన్సులు మిస్ అయినందుకు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటే, మరికొన్ని ఛాన్సులు అనవసరంగా మిస్ అయిపోయానే అని ఫీలయ్యేలా చేస్తాయి. ఇప్పుడు టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర పరిస్థితి కూడా అలానే ఉంది.
నవీన్ చంద్ర యాక్టింగ్ కు స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నవీన్ కు ఈ మధ్య వరుస అవకాశాలు వస్తున్నాయి. తెలుగుతో పాటూ తమిళంలో కూడా సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉన్నాడు నవీన్ చంద్ర. ప్రస్తుతం నవీన్ చంద్ర నటించిన 28°C సినిమా ఏప్రిల్ 4న రిలీజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందింది.
పొలిమేర సిరీస్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు నవీన్ చంద్ర. ఈ ప్రమోషన్స్ లో నవీన్ చంద్ర పలు విషయాలను చెప్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అందులో భాగంగానే నవీన్ చంద్ర గేమ్ ఛేంజర్ సినిమా వల్ల తానొక గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్నట్టు తెలిపాడు.
ఈ మధ్య తనకు కోలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్లొస్తున్నాయని, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా హీరోగా, విలన్ గా కూడా అవకాశాలొస్తున్నాయన్నాడు. గేమ్ ఛేంజర్ సినిమాకు ఎన్నో డేట్స్ ఇచ్చానని, ఆ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే తనకు కోలీవుడ్ నుంచి సూర్య హీరోగా నటిస్తున్న రెట్రో లో విలన్ గా నటించే ఆఫర్ వచ్చిందని కానీ గేమ్ ఛేంజర్ వల్ల రెట్రోకి డేట్స్ ఇవ్వలేకపోయానని చెప్పాడు నవీన్.
సూర్య లాంటి స్టార్ హీరో సినిమాలో విలన్ రోల్ మిస్ అయినందుకు బాధగా ఉందని చెప్తున్న నవీన్ చంద్ర, మరోసారి శంకర్ సినిమాలో ఛాన్స్ వచ్చినా ఆయనతో కలిసి సినిమా చేస్తానని అంటున్నాడు. అయితే గేమ్ ఛేంజర్ కోసం ఎక్కువ రోజులు కేటాయించిన వారిలో నవీన్ మాత్రమే కాదు, గతంలో ప్రియదర్శి కూడా ఇదే విషయం చెప్పాడు. ఆ సినిమా కోసం ఎక్కువ డేట్స్ కేటాయించినప్పటికీ సినిమాలో తాను సినిమా మొత్తం మీద 2 నిమిషాలు కూడా కనపడనని అన్నాడు.