'రాజాసాబ్‌'.. ముగ్గురు కాదు నలుగురు ముద్దుగుమ్మలు

ఈ ముగ్గురు ముద్దుగుమ్మలతో పాటు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార సైతం రాజాసాబ్‌ లో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి.

Update: 2024-12-16 21:30 GMT

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. సినిమాను ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మధ్య సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా విడుదల తేదీ మారే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ ముందుగా అనుకున్న ప్రకారం సినిమాను విడుదల చేస్తామని బల్లగుద్ది మరీ నిర్మాతలు ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.

రాజాసాబ్‌ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మలు మాళవిక మోహన్‌, నిధి అగర్వాల్‌, రిద్ది కుమార్‌లు నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలతో పాటు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార సైతం రాజాసాబ్‌ లో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో నటిస్తూ ఉంటే నాల్గవ ముద్దుగుమ్మ ఎంట్రీ నిజమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయం ఏంటి అంటే సినిమాలో నయన్‌ కీలక పాత్రలో కాకుండా ప్రత్యేక పాటలో కనిపించబోతుంది. మారుతితో ఉన్న పరిచయం, ప్రభాస్‌పై ఉన్న అభిమానంతో నయన్‌ ఐటెం సాంగ్‌కి ఒప్పుకుంది అనే వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్‌తో గతంలో యోగి సినిమా కోసం నయనతార నటించింది. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన సినిమా ఫ్లాప్ కావడంతో మళ్లీ కలిసి కనిపించలేదు. దాదాపు పుష్కర కాలం తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది. ఇందుకు సంబంధించిన చర్చలు దాదాపు పూర్తి అయ్యాయి అని, త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది. తమన్‌ సంగీత సారధ్యంలో ఈ సినిమాకు పాటలు రూపొందుతున్నాయి. ప్రభాస్‌, నయనతార కాంబోలో రాబోతున్న ప్రత్యేక పాటకు తమన్‌ సంగీతం ఇవ్వడం ద్వారా అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందా అనేది చూడాలి.

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార గత కొంత కాలంగా పూర్తిగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు కమిట్‌ అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఎలా రాజాసాబ్‌ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ వార్తలపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే కొందరు మాత్రం ఇప్పటికే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నయనతార కు అడ్వాన్స్ ఇచ్చారు అంటూ ప్రచారం చేస్తున్నారు. అసలు విషయం తెలియాలి అంటే మారుతి నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే ఈ సినిమాలో నాల్గవ హీరోయిన్‌గా నయనతార ఉంటే కచ్చితంగా అభిమానులకు పండగే అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News