భర్త సినిమా అయినా తగ్గేదే లే..!
లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ల జాబితాలో ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు.
లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ల జాబితాలో ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకు నయన్ ఎప్పుడూ ముందు ఉంటుంది అనే విషయం తెల్సిందే.
ఏ సినిమా చేసినా కూడా నయనతార తన పారితోషికం విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది అనే విషయం తెల్సిందే. ఆమె పారితోషికం కారణంగా కొన్ని ప్రాజెక్ట్ లను వదిలేసుకుందనే వార్తలు కూడా ఆ మధ్య వచ్చాయి. తాజాగా మరోసారి నయనతార పారితోషికం తగ్గించుకోవాల్సిందిగా అడిగినందుకు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్' (ఎల్‌ఐసీ). ఈ సినిమాలో హీరో అక్క పాత్రలో నయనతార నటిస్తున్నట్లు ఆ మధ్య అధికారికంగా ప్రకటన వచ్చింది.
సినిమాలో నయనతార పాత్ర పరిమితంగా ఉంటుందట. దాంతో బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె పారితోషికంను తగ్గించుకోవాల్సిందిగా నిర్మాతలు విజ్ఞప్తి చేశారట. కానీ ఆమె మాత్రం తాను పారితోషికం తగ్గించేది లేదు అంటూ నిర్మొహమాటంగా చెప్పేసిందట. ప్రాజెక్ట్ నుంచి బయటకు కూడా వచ్చేసిందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అయినప్పటికీ పారితోషికం విషయంలో తగ్గను అంటూ నయన్ నిర్మొహమాటంగా చెప్పడం విడ్డూరంగా ఉందని తమిళ సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో విఘ్నేష్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడని తెలుస్తోంది.
డబ్బు విషయంలో బంధాలు, బంధుత్వాలు పట్టించుకోకూడదు అంటారు. ఆ విషయాన్ని నయనతార తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో నయన్ ను అభినందించే వారితో పాటు విమర్శించే వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు యూనిట్ సభ్యుల నుంచి స్పందన రాలేదు.